Jharkhand Train Robbery News : గన్లతో వచ్చిన ఓ దొంగల ముఠా రైలులో వెళ్తున్న ప్రయాణికులపై దాడికి దిగింది. వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులను అపహరించుకొని పరారయింది. ఝార్ఖండ్‌లోని సంబల్పుర్ జంక్షన్ నుంచి జమ్ములోని తావీకి వెళ్తున్న టాటా మురి ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. కాగా, జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రైలు ఉత్తర్‌ప్రదేశ్ సోన్‌భద్ర జిల్లాలోని చొపాన్ జంక్షన్‌కు ఉదయం 7:30 నిమిషాలకు చేరుకున్నాక రైల్వే అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత ప్రయాణికులు.
పిస్తోళ్లతో బెదిరింపులు..
శనివారం అర్ధరాత్రి హఠాత్తుగా 10 నుంచి 12 మందితో కూడిన ఓ దొంగల ముఠా ఝార్ఖండ్‌లోని లాథేహార్ రైల్వే స్టేషన్‌లో సంబల్పుర్ జంక్షన్ నుంచి జమ్ములోని తావీకి వెళ్తున్న టాటా మురి ఎక్స్‌ప్రెస్ రైలులోని స్లీపర్ క్లాస్ S-9 బోగీలోకి ఎక్కింది. వెంటనే వారితో తెచ్చుకున్న గన్లను బయటకు తీసి ఎనిమిది నుంచి పది రౌండ్ల వరకు గాల్లోకి కాల్పులు జరిపి ప్రయాణికులను బెదిరించి వారిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ట్రైన్లో ప్రయాణిస్తున్న వారి నుంచి పలు విలువైన వస్తువలను లాక్కున్నారు. ఈ క్రమంలో దొంగలకు ఎదురు తిరిగిన కొందరు ప్రయాణికులను తీవ్రంగా కొట్టారు. ఈ ఘర్షణలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. లాథేహార్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కిన దొంగలు బర్వాధీ స్టేషన్ వచ్చేలోపే దాదాపు 35 నుంచి 40 నిమిషాల్లోనే ఇదంతా పూర్తి చేశారు. అనంతరం స్టేషన్ రాకముందే ట్రైన్ చైన్ లాగి అక్కడి నుంచి పరారయ్యారు. తర్వాత.. బర్వాధీ రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు బాధిత ప్రయాణికులు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాయపడిన వారిని దగ్గర్లోని రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు రెండు గంటల పాటు దాల్తోన్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో ఆగిన రైలు తిరిగి గమ్యస్థానానికి పయనమయింది.
రూ.76 వేలు లూటీ!
ఈ ఘటనలో బాధితుల దగ్గర్నుంచి సుమారు రూ.76,000 నగదు సహా బ్యాగును దొంగలు అపహరించారని అధికారులు గుర్తించారు. ప్రయాణికుల బాగోగులు తెలుసుకున్నారు రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ట్రాఫిక్ మేనేజర్ తౌఫిఖుల్లా. అనంతరం వారికి స్నాక్స్, ఆహారం, నీళ్ల బాటిళ్లు పంపిణీ చేశారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఝార్ఖండ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
"ఈ దోపిడి టాటా మురి ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అలాగే 13 మంది ప్రయాణికుల నుంచి రూ.75,800 నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో పాటు 8 మొబైల్ ఫోన్లను కూడా అపహరించారు. టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకునే పనిలో ఉన్నాము."
- అమ్రేష్ కుమార్, ధన్‌బాధ్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్
- Boy Saves Many Lives : పట్టాలపై గుంత.. రైలుకు ఎదురెళ్లిన పదేళ్ల బాలుడు.. వందల మంది ప్రాణాలు సేఫ్!
- Woman Constable Gender Change : 'పురుషుడిలా మారిపోతా పర్మిషన్ ఇవ్వండి'.. డీజీపీకి లేడీ కానిస్టేబుల్ లేఖ
- Maternal Uncle Nephew Died In Ganesh Immersion Video : గణేశ్ నిమజ్జనంలో విషాదం.. నీట మునిగి మామాఅల్లుళ్లు మృతి