వినూత్న ఆవిష్కరణలకు వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఝార్ఖండ్‌లోని ఛత్రాకు చెందిన మంజీత్ కుమార్. ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం చదువుతున్న అతడు.. మహిళలకు రక్షణ కవచంలా ఉపయోగపడే ఓ పరికరాన్ని రూపొందించాడు. దీంతో లైంగిక వేధింపులు వంటి ఆపద సమయాల్లో మహిళలు, యువతులు వారిని వారు రక్షించుకునే విధంగా ఈ డివైజ్‌ను తీర్చిదిద్దాడు. దాని పేరే.. 'విమెన్ సేఫ్టీ డివైజ్'.
మహిళలు, బాలికలకు వేధింపులు ఎదురైన సమయంలో ఈ ఎలక్ట్రిక్ చెప్పులతో వారిని తంతే కరెంట్ షాక్ తగిలి అక్కడే కిందపడిపోతారు. దీంతో ఇతరుల సాయం కోరకుండానే మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఈ కరెంట్ చెప్పులతో ఉంటుందంటున్నాడు మంజీత్ కుమార్. వీటిని వేసుకొని బయటకు వెళ్తే ఎటువంటి ఆపద వచ్చిన ఎదుర్కోగలమనే ధైర్యం మనకు వస్తుందంటున్నాడు ఈ కుర్రాడు. నిర్భయ వంటి ఘటన మళ్లీ పునరావృత్తం కాకుండా ఉండేందుకు మహిళల రక్షణ కోసం దీనిని రూపొందించానని చెబుతున్నాడు. అయితే ఈ పరికరం మున్ముందు అనేక మంది మహిళలకు ఆపద సమయాల్లో ఉపయోగపడితే చాలని.. ఇందుకోసం ప్రభుత్వ సహకారం అవసరమని అంటున్నాడు మంజీత్ కుమార్.
సాధారణంగా మనం వేసుకునే చెప్పులనే ముడిసరుకుగా తీసుకుని అందులోని కింది భాగంలో నాలుగు బ్యాటరీలు, స్విచ్ సహా మరికొన్ని చిన్న పరికరాలను అమర్చాడు. ఈ డివైజ్‌కు ఒక అరగంట ఛార్జింగ్ పెడితే రెండు రోజుల వరకు తిరగొచ్చు. అంతేకాకుండా కేవలం రూ.500లకే ఈ డివైజ్‌ను తయారు చేయడం విశేషం. ఇందుకోసం మంజీత్ వారం సమయం తీసుకున్నాడు.
"2012లో నిర్భయ ఘటన జరిగినప్పుడు నాకీ ఆలోచన వచ్చింది. మన ఇంటి ఆడపిల్ల బయటకు వెళ్లినప్పుడు ఆమె ఇంటికి తిరిగివచ్చేదాకా ఇంట్లోని తల్లిదండ్రులకు కాస్త టెన్షనే. నిర్భయ ఘటనలు మళ్లీ పునారవృత్తం కాకుండా ఉండేందుకు మహిళలకు భద్రత కలిగించే ఏదైనా డివైజ్‌ను తయారు చేయాలనే ఆలోచన నాలో కలిగింది. దాంట్లో భాగంగానే ఈ 'విమెన్ సెఫ్టీ డివైజ్'ను రూపొందించాను. సాధారణంగా రోడ్లపై మహిళలను ఎవరైనా వేధించినప్పుడు వారు భయపడి ఎదురు తిరగలేరు. ఆ సమయంలో వారి చెర నుంచి ఎలా బయటపడాలో వారికి అర్థం కాదు. అప్పుడు హింసించేవారిని నేను తయారు చేసిన కరెంట్ చెప్పులతో తన్నండి. దీంతో కనీసం 220 నుంచి 300 వోల్ట్ల షాక్ వారికి తగులుతుంది"
- మంజీత్ కుమార్, విద్యార్థి
"ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించే వారిని ఎదుర్కొనేందుకే నా కుమారుడు ఈ పరికరం తయారు చేశాడు. చాలా సంతోషంగా ఉంది. ఈ డివైజ్‌ను నేనే స్వయంగా ప్రచారం చేస్తాను" అని మంజీత్ కుమార్ తల్లి సరుజీ దేవీ తెలిపారు.
"మంజీత్ కుమార్ చాలా తెలివైన విద్యార్థి. అతడు న్యూ ఇన్నోవేషన్, రిసేర్చ్ అంశాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాడు. ఇందుకు మేము కూడా సహకారం అందిస్తుంటాము. ఇందులో భాగంగానే మంజీత్ విమెన్ సేఫ్టీ డివైజ్ పేరుతో మహిళలకు ఉపయోగపడే పరికరాన్ని తయారు చేశాడు. ముఖ్యంగా మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించాడు. అయితే కేవలం రూ.500లకే మహిళలకు వెలకట్టలేని భద్రతను పొందుతూ సురక్షితంగా తిరుగుతారంటే అంతకంటే గొప్ప అచీవ్మెంట్ ఇంకేముంటుంది. భవిష్యత్‌లో మంజీత్ మరిన్ని ఇలాంటి నూతన ఆవిష్కరణలు చేయాలంటూ కోరుతూ ఆల్ ది బెస్ట్."
- బ్రిజేశ్ కుమార్ సింగ్, మంజీత్ చదువుతున్న కళాశాల ప్రిన్సిపాల్