జమ్ముకశ్మీర్‌లో వరుసగా డ్రోన్ల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. బుధవారం జమ్మూ సైనిక స్థావరాలకు సమీపంలో మూడు డ్రోన్లును భద్రతా సిబ్బంది గుర్తించారు. అర్ధరాత్రి 1.30 నుంచి ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల మధ్యలో వేర్వేరు ప్రాంతాల్లో గుర్తు తెలియని డ్రోన్లు సంచరించాయి.
మొదట కాలుచుక్ కంటోన్మెంట్ వద్ద ఓ డ్రోన్ కనిపించింది. ఆ తర్వాత రత్నచక్ సైనిక ప్రాంతానికి సమీపంలో మరోదాన్ని గుర్తించారు భద్రతా సిబ్బంది. మూడోది.. కుంజ్వానీ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద కనిపించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. డిఫెన్స్ ఇన్‌స్టాలేషన్స్ సమీపంలో ఇవి కదలాడినట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
గడిచిన నాలుగు రోజుల్లో మొత్తం 7 డ్రోన్లు సంచరించటం ఉగ్రదాడులపై ఆందోళన పెంచుతోంది.
జమ్మూలోని వాయుసేన విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగిన తర్వాత.. పలు ప్రాంతాల్లో వాటి సంచారం పెరగటం ఆందోళన కలిగిస్తోంది. వాయుసేన స్థావరంపై దాడి చేసింది ఉగ్రవాదులేనని అనుమానిస్తోంది ఎన్ఐఏ. పాక్ నుంచి దేశంలోకి డ్రోన్ల ద్వారా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నట్లు భావిస్తోంది.
ఇదీ చూడండి: ఆర్మీ హెడ్‌క్వార్టర్ వద్ద డ్రోన్ల కలకలం