Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీనగర్‌లోని పంథా చౌక్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారు. ఈ మేరకు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
చనిపోయిన వారిలో ఒకరిని సుహేల్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. అతనికి జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
పంథా చౌక్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వాహించారు. ఈ క్రమంలోనే ముష్కరులు భద్రతాదళాలపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఎన్కౌంటర్ ప్రారంభమైనట్లు అధికారులు పేర్కొన్నారు. కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉమ్మడిగా చేపట్టిని ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులు, మరో సీఆర్పీఎఫ్ జవాన్‌కు గాయాలైనట్లు వివరించారు. వీరిని స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ముంబయిలో దాడులు చేస్తామని ఖలిస్థానీల బెదిరింపు!