Jain Protest Mumbai : జైనుల పుణ్యక్షేత్రం శ్రీ సమ్మద్ శిఖరాజిని ఝార్ఖండ్ ప్రభుత్వం పర్యటక ప్రాంతంగా మార్చడంపై పెను దుమారం చెలరేగింది. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జైన మతస్థులు ఆందోళన చేపట్టారు. ఝార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ముంబయిలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. దిల్లీలో ఇండియా గేట్ వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనలో వేలసంఖ్యలో జైనులు పాల్గొన్నారు. ఝార్ఖండ్ ప్రభుత్వం తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ.. మంగళవారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలోనూ.. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సమ్మద్ శిఖరాజి తీర్థ్‌ను పర్యటక ప్రాంతంగా ప్రకటించడం వల్ల ఆ స్థలం పవిత్రత దెబ్బతింటుందని జైనులు ఆవేదన వ్యక్తం చేశారు.
"పర్యటకం పేరుతో మా నమ్మకాలకు భంగం కలిగించొద్దు. మేము ఎల్లప్పుడూ అహింస, శాంతిమార్గాన్నే అనుసరిస్తాం. కానీ మాపై దాడులు చేస్తే మాత్రం గట్టిగా బదులిస్తాం. శ్రీ సమ్మద్ శిఖరాజి మాకు ఎంతో పవిత్ర ప్రదేశం. అలాంటి ప్రదేశంలోకి లక్షాలది మందిని అనుమతించడం వల్ల దాని పవిత్రత దెబ్బతింటుంది."
రత్నసుందర్ సురీశ్వర్ మహారాజ్, జైన ఆచార్యుడు
భారత్.. మైనార్టీలకు స్వర్గధామమా?
శ్రీ సమ్మద్ శిఖరాజి వివాదంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. భారత్.. మైనార్టీలకు స్వర్గధామమని భాజపా చెపుతోందని.. కానీ అనేక మంది మైనార్టీలు రోజూ ఎన్నో అన్యాయాలకు గురవుతున్నారని విమర్శించారు. క్రిస్మస్ తర్వాత క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయని.. లద్దాఖ్‌లో బౌద్ధులు, షియాలు రోడ్లపై ఉన్నారని ఆరోపించారు.
ఝార్ఖండ్‌లోని గిరిద్ జిల్లాలో పరసనాథ్ హిల్స్‌పై ఉన్న శ్రీ సమ్మద్ శిఖరాజి పుణ్యక్షేత్రాన్ని ఏటా లక్షలాది మంది జైనులు సందర్శిస్తారు. ఈ మందిరాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా మార్చాలంటూ 2018లో కేంద్రాన్ని కోరింది ఝార్ఖండ్ ప్రభుత్వం. 2019లో ఈ ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించింది కేంద్రం. కానీ ఝార్ఖండ్ ప్రభుత్వం పర్యటక ప్రాంతంగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇవీ చదవండి: 'సమస్యలు కాదు.. లవ్ జిహాద్‌పై దృష్టి పెట్టండి'.. కార్యకర్తలకు భాజపా ఎంపీ సూచన
రేప్ కేసులో నాలుగున్నరేళ్లకు విముక్తి.. ప్రభుత్వం నుంచి రూ.10,000కోట్ల పరిహారం డిమాండ్