Tihar jail inmate Phone: తిహాడ్ జైలులో ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి మొబైల్ ఫోన్‌ను మింగేశాడు. జైలు వార్డెన్, ఇతర ఖైదీల కళ్లెదురుగానే ఈ పని చేశాడు. వెంటనే అతడిని జైలులోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించారు. ఎక్స్‌రే సహా ఇతర పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అతడి పొట్టలో ఫోన్ ఉందని నిర్ధరించారు. పది రోజులు కష్టపడి ఫోన్‌ను బయటకు తీశారు.
Jail inmate swallowed mobile
కొద్దిరోజుల పాటు ఆ ఖైదీని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తిహాడ్ జైలు డీజీ సందీప్ గోయల్ చెప్పారు. ఆపరేషన్ చేయకుండానే సెల్‌ఫోన్ తీయాలని వైద్యులు భావించినందున.. పది రోజుల సమయం పట్టిందని తెలిపారు. జనవరి 15న అతడి శరీరంలో నుంచి ఫోన్ బయటకు వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని వివరించారు. దీంతో అతడిని తిరిగి జైలుకు పంపినట్లు స్పష్టం చేశారు.
జైలులోకి సెల్‌ఫోన్ ఎలా?
జైలులోని ఖైదీల గదులను అధికారులు ఓ రోజు తనిఖీ చేశారు. అనుమతించని వస్తువులేమైనా ఖైదీల వద్ద ఉన్నాయా అని వెతికారు. 'ఈ సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. ఏదో దాచేందుకు ప్రయత్నించాడు. వెంటనే వార్డెన్ అతడి వద్దకు వెళ్లాడు. ఈ లోపే ఫోన్‌ను మింగేశాడు. ఆ ఫోన్ చాలా చిన్నగా ఉంది' అని తిహాడ్ జైలు అధికారులు తెలిపారు.
అయితే, జైలులోకి సెల్‌ఫోన్ ఎలా వచ్చిందనే విషయం తెలియలేదు. నిబంధనలన్నీ కఠినంగా అమలు చేసినా ఫోన్ కనిపించడంపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఇదీ చదవండి: బాలికపై గ్యాంగ్‌రేప్.. నదిలో మృతదేహం.. JNUలో యువతిపై లైంగిక దాడి!