IT raids in Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సమాజ్‌వాది పార్టీ నేతల నివాసాలు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ శనివారం దాడులు చేపట్టింది. ఎస్పీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్ నివాసం, ఆర్సీఎల్ సంస్థకు చెందిన మనోజ్ యాదవ్ సహా పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సన్నిహితుల నివాసాల్లో సోదాలు నిర్వహిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ హయాంలో పవర్ కార్పొరేషన్ భూగర్భ కేబుల్స్‌కు సంబంధించి భారీ మోసం జరిగిందని, నేతలు.. లక్షల కోట్ల అవినీతికి పాల్పడారన్న ఆరోపణలపై దాడులు నిర్వహిస్తున్నామని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది.
ఉదయం 7.30 గంటలకు మౌ ప్రాంతంలోని రాజీవ్ నివాసానికి చేరుకున్న అధికారులు.. సోదాలు చేపట్టారు. రాజీవ్ రాయ్.. అనేక బినామీ ఆస్తులు కూడబెట్టడం, ఆదాయపు పన్ను ఎగవేతకు సంబంధించిన పక్కా సమాచారంతోనే సోదాలు చేస్తున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. అనేక ముఖ్యమైన పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాంకు సంబంధిత లావాదేవీలు, ఆస్తి సంబంధిత పత్రాలు, చర మరియు స్థిరాస్తులకు సంబంధించిన లావాదేవీలు, దాని కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ కుట్రలో భాగంగానే ఈ ఐటీ దాడులు జరుగుతున్నట్లు రాజీవ్ రాయ్ ఆరోపించారు.
"నా వద్ద ఎలాంటి బ్లాక్‌మనీ, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లు లేవు. నేను ప్రజాసేవ చేయడం ప్రభుత్వానికి నచ్చలేదు. దాని ఫలితమే ఈ రైడ్లు. ఒకవేళ చేస్తే ఇదే విధంగా తప్పుడు కేసుల్లో పెడతారు."
-రాజీవ్ రాయ్, సమాజ్‌వాది పార్టీ నేత
భాజపాకు ఓటమి తప్పదు..
రాజీవ్ రాయ్ సహా సమాజ్‌వాదీ పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను విభాగం దాడులు చేయడం పట్ల ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నందున, తమ పార్టీని ఇబ్బందులకు గురి చేసేందుకే భాజపా.. దర్యాప్తు సంస్ధలను పురిగొల్పుతోందని ఆరోపించారు. తమ పట్ల ఎన్ని కుట్రలు చేసినా, సమాజ్‌వాదీ పార్టీ గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు. రైతు సమస్యలు, అభివృద్ధి సహా అన్నింటా విఫలమైన భాజపాకు ఓటమి తప్పదని అఖిలేశ్ తెలిపారు. రాజకీయ విరోధులను వేధించడంలో కాంగ్రెస్ బాటలోనే భాజపా నడుస్తోందని విమర్శించారు. యూపీ శాసనసభ ఎన్నికల్లో పోరాటం చేసేందుకు ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ వచ్చిందని, త్వరలో ఈడీ, సీబీఐ కూడా వస్తాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : టీకా మూడు డోసులు తీసుకున్న వ్యక్తికి.. ఒమిక్రాన్ పాజిటివ్!