IT raids at BRS MLAs house In Hyderabad : తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన ఆదాయపు పన్నుశాఖ నిర్వహిస్తున్న ఐటీ దాడులు నేడు కూడా జరగనున్నట్టు సమాచారం. హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున నిర్వహించిన దాడుల్లో దాదాపు 70 ఐటీ బృందాలు పాల్గొన్నాయి. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, వారి బినామీలే టార్గెట్‌గా.. వారి ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించాయి. వైష్ణవి గ్రూపు స్థిరాస్తి సంస్థతో పాటు హోటల్ అట్ హోమ్ హోటల్ సంస్థపై కూడా దాడులు చేసినట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి.
IT raids at BRS MLAs house In Telangana : బుధవారం ఉదయం నుంచి ఏకకాలంలో జరుగుతున్న ఈ సోదాలల్లో 70 బృందాలు పాల్గొన్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ తనిఖీల్లో ఎలాంటి నగదును ఇప్పటివరకు స్వాధీనం చేసుకోలేదని ఐటీ అధికారులు తెలిపారు. హైటెక్ సిటీ లుంబిని స్ప్రింగ్స్ విల్లాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరుల ఇళ్లపై దాదాపు 15 బృందాలు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సహకారంతో సోదాలు నిర్వహించారు.
నాగర్ కర్నూల్, భువనగిరి ఎమ్మెల్యేల ఇంట్లో సోదాలు : అదేవిధంగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మరి జనార్ధన్ రెడ్డి ఇంటిపైన, ఆయన కార్యాలయాలపై తనిఖీలు నిర్వహించారు. ఇంతలో జనార్ధన్ రెడ్డి తల్లికి అనారోగ్యం చేయడంతో ఆమెను ఐటీ అధికారులే ఆస్పత్రికి తరలించారు. మరి జనార్ధన్ రెడ్డికి జేసీ బ్రదర్స్ షాపింగ్ మాల్‌లో కూడా తనిఖీలు చేశారు. మరొకవైపు కొత్తపేట గ్రీన్‌హిల్స్ కాలనీలోని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. అధికార పార్టీకి చెందిన ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్న వ్యాపారాలకు సంబంధించిన స్థిరాస్థి, హోటళ్ల వ్యాపార సంస్థలపై దాడులు చేశారు.
రికార్డులు పరిశీలించిన తర్వాతనే వివరాల వెల్లడి : ఉదయం నుంచి కొనసాగిన ఈ సోదాల్లో ఆయా సంస్థలు నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలకు చెందిన వివరాలను ఐటీ బృందాలు పరిశీలించాయి. గత ఆర్థిక సంవత్సరం, అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఈ సంస్థలు నిర్వహించిన వ్యాపారాలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. వాటికి వచ్చిన ఆదాయం.. ఆయా సంస్థలు చెల్లించిన ఆదాయపు పన్ను తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించిన తరువాతనే.. ఐటీ శాఖ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ సోదాలు గురువారం కూడా కొనసాగుతాయని ఐటీ అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి: