స్పీకర్ల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనతో మరోమారు జమిలి ఎన్నికలు చర్చనీయాంశమవుతున్నాయి. లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఈ జమిలిపై.. ఇప్పటికే మోదీ అనేకసార్లు తన సానుకూలతను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా మరోమారు ఆయన మనసులో మాట బయటపెట్టారు! ఇంతకూ జమిలి ఎన్నికలు సాధ్యమేనా? వాటి వెనకాలున్న సాధకబాధకాలేంటి? జమిలిపై ఇప్పటిదాకా జరిగిన కసరత్తేంటి?
ఆడ్వాణీ ఆద్యుడు
- ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనకు ఆద్యుడు భాజపా అగ్రనేత ఎల్.కె. ఆడ్వాణీ. 1990 చివర్లో ఆయనీ ప్రతిపాదన తెచ్చారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ మళ్లీ దాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు.
- 2015లో న్యాయశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ కూడా జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసింది.
- 2021 కల్లా రెండుదశల్లో జమిలి ఎన్నికలు నిర్వహించొచ్చంటూ గతంలో నీతి ఆయోగ్ ఒక నివేదిక కూడా సమర్పించింది.
- 2017లో అప్పటి ఎన్నికల చీఫ్ కమిషనర్ ఓపీ రావత్ జమిలి ఎన్నికలకు కమిషన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
- 2018లో లా కమిషన్ దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయగా.. అన్నాడీఎంకే, సమాజ్‌వాద్ పార్టీ, తెరాస మద్దతిచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, తెదేపా, సీపీఐ, సీపీఎం, జనతాదళ్‌లాంటి పార్టీలు వ్యతిరేకించాయి. భాజపా, కాంగ్రెస్‌లు తటస్థంగా ఉండిపోయాయి.
అప్పుడెలాగ జరిగాయి..
జమిలి ఎన్నికలు నిజానికి కొత్తేమీ కాదు. గతంలో మన దేశంలో జరిగాయి కూడా. 1951 నుంచి 1967 దాకా లోక్‌సభ, అసెంబ్లీలకు(ఎక్కువ శాతం) ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1957లో 76శాతం రాష్ట్రాల అసెంబ్లీకి లోక్‌సభతో పాటు ఎన్నికలైతే... 1967నాటికి ఇది 67 శాతానికి తగ్గింది. 1968-69లో కొన్ని అసెంబ్లీలు ముందుగానే రద్దయ్యాయి. 1970లో లోక్‌సభ కూడా రద్దయింది. అప్పట్నుంచి రాష్ట్రాల, లోక్‌సభ ఎన్నికలు పట్టాలు తప్పి విడివిడిగా నడుస్తున్నాయి.
10 దేశాల్లో ఇదే పద్ధతి..
జమిలి ఎన్నికల్ని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇప్పటికే అనుసరిస్తున్నాయి. ఈ జాబితాలో స్వీడన్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, జర్మనీ, స్పెయిన్, హంగేరీ, బెల్జియం, పోలండ్, స్లోవేనియా, ఆల్బేనియా.. తదితర దేశాలున్నాయి. స్వీడన్లో నాలుగేళ్లకోసారి సెప్టెంబర్‌లో రెండో ఆదివారం అన్ని రాష్ట్రాలు, జాతీయ ఎన్నికలతో పాటు స్థానిక(మున్సిపాలిటీలకు) ఎన్నికలు కూడా జరుగుతాయి.
జమిలి ఎందుకంటే..
- పదే పదే ఎన్నికల గురించి ఆలోచించకుండా ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి సారించొచ్చు.
- ఓట్ల శాతం పెరుగుతుంది.
- ఖర్చు తగ్గుతుంది.
- అవినీతి, నల్లధన వినియోగం తగ్గుతుంది.
- సిబ్బంది వినియోగం, నిర్వహణ ఖర్చు ఆదా అవుతుంది.
ఇండోనేషియాలో కూడా ఇప్పుడు ప్రతి ఐదేళ్లకోసారి ఇదే పద్ధతిలో రాష్ట్రాలు, జాతీయ ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు. అయితే.. వీటిలో చాలా దేశాలు అధ్యక్ష తరహా పాలనలో ఉన్నవి కావడం గమనార్హం.
రాజ్యాంగ సవరణ అవసరం..
అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభకు ఇకమీదట ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్నా రాజ్యాంగ సవరణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. జమిలి ఎన్నికలంటే.. అనేక రాష్ట్రాలు తమ పదవీకాలం ముగియకముందే అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఆర్టికల్-356 ద్వారా అసెంబ్లీలను రద్దుచేసే అధికారం కేంద్రానికి ఉంది. మరే రకంగా చేసినా అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. కాబట్టి అసెంబ్లీల కాలపరిమితిని తగ్గించాలన్నా, పెంచాలన్న సవరణ అవసరం. అది కూడా మూడింట రెండొంతుల మెజార్టీతో.
మరి పదే పదే జమిలి మంత్రం పఠిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సర్కారు, కశ్మీర్, ముమ్మారు తలాఖ్‌ల మాదిరిగా మెజార్టీ పార్టీలను ఒప్పించి, తాను అనుకున్నట్టు రాజ్యాంగ సవరణ ద్వారా ముందుకు వెళుతుందా అనేది ఆసక్తికరం!
ఎందుకు వద్దంటే..
- రాజ్యాంగంలో లేదు కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం.
- గడువులోపే లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో ప్రభుత్వాలు మధ్యలోనే పడిపోతే ఎలా?
- జాతీయ పార్టీలకు లాభం చేకూరొచ్చు. ఎందుకంటే జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీకి కూడా ప్రజలు ఓటు వేస్తే.. ప్రాంతీయ పార్టీలు దెబ్బతిని, జాతీయ పార్టీలకు ప్రయోజనం చేకూరే అవకాశముంది. ఇది క్రమంగా అధ్యక్ష తరహా పాలనకు దారి తీస్తుంది.
- పార్టీల ఖర్చేమీ తగ్గకపోవచ్చు.
- ప్రభుత్వాలు ముందస్తుగానే అవిశ్వాసం ఎదుర్కొని కూలిపోతే ఎలా అనేది జమిలి ఎన్నికలకు ప్రధాన అడ్డంకిగా నిలవడం వల్ల.. 1999లో వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలో అప్పటి లా కమిషన్ ఒక ప్రతిపాదన చేసింది. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించేవారు.. ప్రత్యామ్నాయంగా(విశ్వాస తీర్మానం నెగ్గగల) ఎవరు నెగ్గుతారో చూపించాలనే నిబంధన పెట్టాలని సిఫార్సు చేసింది.
- అలాగే ఒకేసారి ఎన్నికలు నిర్వహించినప్పుడు జాతీయ అంశాలు అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయకపోవచ్చనే ఉదాహరణలు కూడా ఉన్నాయి. 2004 నుంచి నాలుగుసార్లు ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతో పాటే జరిగాయి. ఫలితాలెప్పుడూ వేర్వేరుగానే ఉంటున్నాయి.
ఇదీ చదవండి: పోలింగ్ శాతమే ప్రజాస్వామ్యానికి కొలమానం