International Flights From India: కొవిడ్ కారణంగా నిలిచిపోయిన రెగ్యులర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు ఏప్రిల్ నాటికి తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పౌర విమానయాన శాఖ.. హోంశాఖ, ఆరోగ్యశాఖలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మార్చి- ఏప్రిల్ నెలల్లో అంతర్జాతీయ విమానాలు ప్రారంభించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. 2020లో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఏఈ ఇలా.. సుమారు 28 దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆయా దేశాలకు ప్రత్యేక విమానాలను నడుపుతున్నారు. వాస్తవానికి డిసెంబర్ 15న అంతర్జాతీయ విమానాలను ప్రారంభించాలని కేంద్రం తొలుత భావించింది. ఒమిక్రాన్ కేసుల పెరగడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
ప్రస్తుతం ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగనున్నాయి. కేసులు తగ్గుముఖం పట్టడం, వివిధ దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: 'ఆ ఆంక్షలు ఎత్తేయండి!'.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన