Islamic Radicals Case Update : హైదరాబాద్‌లో కలకలం రేపిన ఇస్లామిక్ రాడికల్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ నగరంలోని చాంద్రాయణగుట్టలో ఏటీఎస్ పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఇవాళ బాబానగర్‌లో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నేడు మరొకరిని అదుపులోకి తీసుకోవడంతో ఉగ్రవాద కార్యకలాపాల కేసులో అరెస్టుల సంఖ్య 16కి చేరింది.
విధ్వంసానికి పథక రచన చేసిన హిజ్బ్ ఉత్ తహరీర్ కేసులో భాగ్యనగరంలో ఇప్పటికే అరెస్టు అయిన ఐదుగురిని మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఏటీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీ విచారణలో భాగంగా ఈ ఐదుగురు నిందితులను ఇవాళ హైదరాబాద్‌కు తీసుకు వచ్చి విచారణ జరిపారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా చాంద్రాయణగుట్టలో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందే అరెస్టు అయిన ఐదుగురు నిందితులు చేసిన ఉగ్ర కుట్ర వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని ఆ వ్యక్తికి అందించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఏటీఎస్ పోలీసులు టాస్క్‌ఫోర్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల సాయంతో విచారణ చేపడుతున్నారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నగరంలో అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు, సమర్థవంతమైన వ్యవస్థ ఉన్నా... ఉగ్రవాదులను పసిగట్టడంలో కొన్నిసార్లు పోలీసు యంత్రాంగం విఫలమవుతోందనే విమర్శలు ఉన్నాయి. నగరం నుంచి పెద్ద ఎత్తున పేలుళ్లకు కుట్ర జరుగుతున్నా, స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేకోపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు ఉగ్రవాదుల ముప్పు పెను ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో ప్రస్తుత అరెస్టులు మరోసారి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దేశంలో ఎక్కడ ఉగ్రవాద మూలాలు బయటపడినా... అందుకు హైదరాబాద్‌తో లింకులు ఉంటాయన్న నానుడి మరోసారి నిజమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర బలగాలు హైదరాబాద్‌కు పటిష్ఠమైన భద్రత వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: