దిల్లీ వేదికగా.. ఈ నెల 23,24 తేదీల్లో.. భారత్-పాకిస్థాన్‌కు చెందిన ఇండస్ కమిషనర్లు భేటీ కానున్నారు. చినాబ్ నదిపై భారత్ నిర్మాణానికి తలపెట్టిన హైడ్రోపవర్ ప్రాజెక్టులపై పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనితో పాటు వివిధ అంశాలపై అధికారులు చర్చించనున్నట్టు తెలుస్తోంది.
ఇది శాశ్వత ఇండస్ కమిషన్ వార్షిక భేటీ. ఇండస్ వాటర్ ఒప్పందంలో భాగంగా.. ఇరు దేశాల కమిషనర్లు ఏడాదిలో కనీసం ఒక్కసారైనా సమావేశమవ్వాల్సి ఉంటుంది.
ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన అనంతరం జరుగుతున్న తొలి భేటీ ఇది. గతేడాది దిల్లీలోనే సమావేశం జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా అది వాయిదా పడింది.
అయితే ఇటీవలి కాలంలో లద్దాఖ్‌లో అనేక హైడ్రోపవర్ ప్రాజెక్టులకు అనుమతులిచ్చింది భారత్. ఈ భేటీలో దీనిపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశముంది.
ఇదీ చూడండి:- 'భారత్‌తో చర్చలకు పాక్ ఎప్పుడూ సిద్ధం'