ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు అమలు చేస్తున్న ఉచిత మధ్యాహ్న భోజన పథకం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఈ భోజనాన్ని చేసి ఎదిగిన అమ్మాయిలకు వివాహానంతరం కలిగిన సంతానం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటోందో తెలుసుకునేందుకు దీనిని నిర్వహించారు. ఫలితాలను 'నేచుర్ కమ్యూనికేషన్స్' పత్రికలో ప్రచురించారు. పిల్లల్లో పోషకాహార లోపాలను సరిదిద్దడానికి ఈ పథకం మార్గనిర్దేశం చేస్తోందని 'అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ' (ఐఎఫ్‌పీఆర్‌ఐ) పరిశోధకులు చెబుతున్నారు. పోషకాహార లోపమున్న చిన్నారులు ఎక్కువగా ఉండడమే కాకుండా, ప్రపంచంలో అతిపెద్దదైన మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నది మన దేశమేనని ఈ సంస్థ పేర్కొంది. 1993 నుంచి 2016 వరకు దేశవ్యాప్తంగా ఈ పథకం వల్ల ప్రయోజనం పొందినవారి నుంచి పలువురిని ఎంపిక చేసుకుని, వారి పిల్లల ఆరోగ్యం ఎలా ఉందనేది అధ్యయనంలో గమనించారు.
భవిష్య తరాల పిల్లల్లో ఎదుగుదల లోపాలు తలెత్తకుండా చేయడానికి పథకం ఉపయోగపడుతోందని గుర్తించినట్లు అధ్యయన నివేదిక రచయితల్లో ఒకరైన సుమన్ చక్రవర్తి (వాషింగ్టన్ విశ్వవిద్యాలయం) తెలిపారు. బడి మానేయకుండా విద్య కొనసాగించడానికి, ఆరోగ్య పరిరక్షణకు ఈ పథకం మేలు చేస్తోందని చెప్పారు. విద్యార్థుల హాజరు శాతం పెంచడం సహా వివిధ రూపాల్లో ఉపయోగపడుతున్న పథకాన్ని ప్రాథమిక పాఠశాలల కంటే పెద్దస్థాయికి 'పెంచాలా అనేదానిపై మరింత పరిశోధన అవసరమన్నారు. పథకాన్ని 1995లోనే ప్రారంభించినా కొన్ని రాష్ట్రాలే దీనిని అమలు చేస్తున్నాయని, 6 నుంచి పదేళ్ల లోపు బాలికల్లో 6 శాతం మందికే మధ్యాహ్న భోజనం అందుతోందని పరిశోధకులు చెప్పారు.
ఇదీ చూడండి: పిల్లల్లోనూ పోస్ట్ కొవిడ్ లక్షణాలు!