Indian Woman Anju Marries Pak Facebook Friend : ప్రియుడిని పెళ్లాడేందుకు పాక్ నుంచి భారత్‌కు వచ్చిన సీమా గులాం హైదర్ తరహాలోనే ఫేస్‌బుక్ స్నేహితుడిని కలిసేందుకు పాక్ వెళ్లిన 34 ఏళ్ల అంజూ.. 29 ఏళ్ల నస్రుల్లాఖాన్‌ను వివాహం చేసుకుంది. కట్టుకున్న భర్తనూ, కన్న బిడ్డలనూ కాదనీ ఖైబర్ పక్తున్వాలోని అప్పర్ దిర్ జిల్లాకు చెందిన నస్రుల్లాను పెళ్లాడింది. వారిద్ధరి నిఖా ఘనంగా జరిగిందనీ.. అంజూ చాలా ఆనందంగా ఉందనీ పాక్ అధికారులు తెలిపారు. పెళ్లికి ముందే మతం మారి ఇస్లాం స్వీకరించిన అంజూ.. తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. పెళ్లి తర్వాత అంజూ, నస్రుల్లా కుటుంబీకులతో సహా స్థానిక కోర్టులో హాజరై తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత లవారీ టన్నెల్ అనే పర్యటక ప్రాంతానికి విహారానికి వెళ్లి ఫొటోలు దిగారు. అంజూ వాఘా సరిహద్దు నుంచి 30 రోజుల విసాతో పాక్‌కు వెళ్లింది.
యూపీలో పుట్టిన అంజూకు రాజస్థాన్‌కు చెందిన అరవింద్‌తో పెళ్లయింది. ఆమెకు 15 ఏళ్ల కుమార్తె, 6ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయని అంజూ తండ్రి గయా ప్రసాద్ థామస్ తెలిపాడు. అంజూకు అక్రమ సంబంధాలేం లేవని అయితే చాలా మొండిదనీ ఎవరేం చెప్పినా వినదని వెల్లడించాడు. అందుకే అంజూను తెలిసిన వారింట్లో ఉంచి పెంచినట్లు వివరించాడు. ఆమెను చాలాసార్లు స్వభావం మార్చుకోవాలని హితబోధ చేసినట్లు గయా ప్రసాద్ తెలిపాడు. అంజూ భర్త చాలా మంచివాడనీ నెమ్మదస్తుడని ప్రసాద్ అన్నారు.
జూలై 21 అంజూ స్నేహితులను కలిసేందుకు జయపురకు వెళ్తున్నానని భర్తకు అబద్ధం చెప్పి పాక్‌కు వెళ్లింది. లాహోర్‌కు వెళ్లినట్లు వాయిస్ కాల్ చేసి భర్తకు చెప్పింది. త్వరలో వచ్చి అన్ని విషయాలు చెబుతానందని ఆమె భర్త మీడియాకు తెలిపాడు. ఇన్నేళ్లలో అంజూపై ఒకసారి కూడా అనుమానం రాలేదని వివరించాడు. 2019లో అంజూకు ఫేస్‌బుక్‌లో నస్రుల్లాఖాన్ పరిచయమయ్యాడు. చాటింగ్‌లో పరిచయం ప్రేమగా మారింది. తరచూ వీడియోకాల్‌లు చేసుకున్నట్లు రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. తామిద్దరం స్నేహితులం మాత్రమే అని.. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు పాక్‌కు వచ్చినట్లు అంజూ కుటుంబీకులకు తెలిపింది. నస్రుల్లాఖాన్ కూడా తమ మధ్య ప్రేమ లేదని ఆమె తిరిగి భారత్‌కు వస్తుందని వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికి వివాహం జరిగింది. అటు పాక్‌కు చెందిన సీమా హైదర్ అనే యువతి యూపీలోని సచిన్‌మీనా అనే పబ్జీ ప్రియుడిని కలిసేందుకు నలుగురు పిల్లలతో సహా భారత్‌కు వచ్చింది. ఇక్కడ సచిన్‌ను పెళ్లి చేసుకునే ముందు మతం మార్చుకుంది.