దేశంలో కరోనా రెండో దశ మరింత విజృంభిస్తుందని మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సర్జన్, 'నారాయణ హెల్త్' వ్యవస్థాపకులు డాక్టర్ దేవీ ప్రసాద్ శెట్టి అంచనా వేశారు. ఫలితంగా.. అదనంగా 5 లక్షల ఐసీయూ పడకలు సహా 2 లక్షల మంది నర్సులు, 1.5 లక్షల మంది వైద్యులు అవసరమవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం.. దేశంలో సుమారు 75వేల నుంచి 90వేల వరకు ఐసీయూ పడకలు ఉన్నాయన్న ప్రసాద్.. వాటన్నింటినీ ఇప్పటికే కొవిడ్ రోగులు ఆక్రమించారని తెలిపారు.
రెండోదశ కరోనా విజృంభణలో దేశంలో ఇప్పటికే సగటున రోజుకు 3.5 లక్షల కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ ఉద్ధృతి గరిష్ఠ స్థాయికి చేరితే.. రోజుకు 5లక్షలకు పెరిగే అవకాశముందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.
కరోనా సోకినప్పటికీ.. చాలా మంది టెస్ట్‌లకు దూరంగా ఉన్నారని ప్రసాద్ తెలిపారు. ఇలా రోజుకు 15 నుంచి 20 లక్షల మంది వైరస్ బారినపడుతున్నారని ఆయన అన్నారు. పరీక్షలు చేయించుకోనందున లెక్కలోకి రావడం లేదని స్పష్టం చేశారు. గణాంకాల ప్రకారం.. కొవిడ్ సోకిన వారిలో ఐదు శాతం మందికి ఐసీయూ పడకలు అవసరమవుతున్నాయని.. ఒక్కో రోగి కనీసం 10 రోజులపాటు ఐసీయూలోనే గడపాల్సి వస్తుందని వివరించారు. ఈ లెక్కన రాబోయే కొద్ది వారాల్లో కనీసం 5 లక్షల అదనపు ఐసీయూ పడకలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
"మహమ్మారి ప్రారంభానికి ముందే దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాస్పత్రులలో సుమారు 78శాతం వైద్య నిపుణుల కొరత ఉంది. రాబోయే విపత్కర పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని కనీసం 1.5 లక్షల మంది వైద్యులు, రెండు లక్షల మంది నర్సులను ప్రభుత్వం తయారు చేయాలి. ఇలా అన్ని రకాల ఏర్పాట్లతో మూడో దశ కరోనాకు సన్నద్ధంగా ఉండాలి."
- డాక్టర్ దేవీ ప్రసాద్ శెట్టి, సర్జన్ - నారాయణ హెల్త్
ఇదీ చదవండి: కరోనా రోగుల కోసం 'ఆటో అంబులెన్స్' సేవలు