రష్యా-భారత్ మధ్య ఉన్న సంబంధాలు ఇతర దేశాల వల్ల ప్రభావితం కావని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. ఇరుదేశాల బంధం వాటి సొంత యోగ్యతపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్తో.. బాగ్చి సమావేశమయ్యారు.
"రష్యాతో మనకున్న ప్రత్యేక భాగస్వామ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఈ పర్యటన ఒక మంచి అవకాశం. త్వరలో జరిగే భారత్-రష్యా వార్షిక సదస్సు, ద్వైపాక్షిక భాగస్వామ్యం గురించి చర్చించడానికి ఈ పర్యటన చాలా ఉపయోగపడుతుంది."
-అరిందమ్ బాగ్చి, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
కాగా, పాకిస్థాన్‌కు రక్షణ సామాగ్రిని రష్యా సరఫరా చేస్తున్న విషయం గురించి మాత్రం బాగ్చి మాట్లాడలేదు.
జైశంకర్‌తో సెర్గెయ్ భేటీ
భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తోనూ సెర్గెయ్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు కీలక చర్చలు జరిపారు.
"ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక భాగస్వామ్యం దృఢంగా, ముందు చూపుతో ఉంది. న్యూక్లియర్ స్పేస్, రక్షణ రంగంలో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి సంబంధించి చర్చలు జరిగాయి. ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్, చెన్నై-వ్లాదివోస్త్కోక్ జలరవాణా కారిడార్ గురించి చర్చించాం."
-ఎస్ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి
రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థను భారత కొనుగోలు విషయంలో అమెరికా వైఖరిపై సెర్గెయ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏ దేశంపైనైనా అమెరికా ఒత్తిడి చేయాలని చూస్తే రష్యా నుంచి తగిన ప్రతిస్పందన వస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: బంగ్లాదేశ్ పర్యటనలో భారత ఆర్మీ చీఫ్