కరోనా వైరస్ విజృంభణను కట్టడి చేయడంలో భారత్ చెప్పుకోదగ్గ పురోగతి సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ప్రశంసించారు. జెనీవాలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ తీసుకుంటున్న చర్యలను ప్రధానంగా ప్రస్తావించారు.
"కరోనా వైరస్ విజృంభణను అడ్డుకోవడంలో భారత్ గొప్ప పురోగతి సాధించింది. చిన్నపాటి ప్రజారోగ్య పరిష్కారాలను పాటించగలిగితే వైరస్‌ను ఓడించవచ్చని ఇది మనకు చూపిస్తోంది. ఈ క్రమంలో టీకాలను జోడించడం వల్ల, మనం మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు"
--టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్
భారత్‌లో కరోనా వైరస్ వెలుగుచూసిన దగ్గరి నుంచి..సెప్టెంబర్ నెల మధ్య వరకు కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది. ఒక దశలో కేసులు లక్షకు చేరువయ్యాయి. అయితే, ఆ తరవాత నుంచి రోజూవారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం 10 వేల నుంచి 20 వేల మధ్యలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఒక్కోసారి పదివేల దిగువకు పడిపోతున్నాయి. ఎప్పటికప్పుడు కొవిడ్ పరిస్థితులను పర్యవేక్షించి, తదనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తున్నామని ఇటీవల కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే పార్లమెంట్‌లో వెల్లడించారు. తాజాగా దేశంలో 11,713 కొత్త కేసులు వెలుగుచూడగా.. 95 మరణాలు సంభవించాయని కేంద్రం శనివారం వెల్లడించింది.