దేశంలో కరోనా రెండో దశ నెమ్మదించింది. మూడో దశ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2022లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఎలా?
అన్ని రాజకీయ పక్షాల మదిలో ఇదే ప్రశ్న. అయితే ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు.. రోబోలే పరిష్కారంగా కనిపిస్తోంది. ఇందుకోసం వన్ స్టాండ్ ఇండియా ప్రైవెట్ లిమిటెడ్ అనే సంస్థ ప్రత్యేక హ్యూమనాయిడ్ రోబోలను అభివృద్ధి చేసింది. వాటికి 'డూట్'గా నామకరణం కూడా చేసింది.
కరోనా వేళ.. ప్రధాన పార్టీలు కూడా రోబోలతో ప్రచారమే అత్యుత్తమ మార్గమని భావిస్తున్నాయి. వాయిస్ రికగ్నిషన్, ఫేస్ రికగ్నిషన్‌తో పాటు రాజకీయ నాయకుల హావభావాలతో కమ్యూనికేట్ చేయడం 'వన్ స్టాండ్ ఇండియా' తీర్చిదిద్దిన రోబో ప్రత్యేకత.
తమిళనాడులో మొదట వినియోగం
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ రోబోలను వినియోగించే అవకాశం ఉంది. ఇందుకోసం ఆయా రాజకీయ పార్టీలతో వన్ స్టాండ్ ఇండియా సంప్రదింపులు జరుపుతోంది.
2022లో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి.
ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన రాజకీయ సంస్థ ఇండియా మక్కల్ మున్నేట్ర కచ్చి (ఐఎంఎంకే) తొలిసారిగా ఎన్నికల ప్రచారం కోసం హ్యూమనాయిడ్ రోబోను వినియోగించింది. 'డూజీ' అని పిలిచే నాలుగు అడుగుల రోబో ఆ పార్టీ చిహ్నం.
రోబో రోవర్ భారీ వీల్ బేస్‌ను కలిగి ఉంటుందని వన్ స్టాండ్ ఇండియా డైరెక్టర్ కుమార్ కన్హయ్య సింగ్ తెలిపారు.
"ఆల్ వీల్ డ్రైవ్ గేర్‌బాక్స్ ఉండటం వల్ల ఇది కఠినమైన ఉపరితలాలపై కూడా సులభంగా కదులుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా అందులో ఉండే వాయిస్ రికగ్నిషన్‌తో ఆ రోబో రాజకీయ నాయకుడి తరఫున ప్రజలను ఉద్దేశించి రోబో ప్రసంగిస్తుంది."
-కుమార్ కన్హయ్య సింగ్, వన్ స్టాండ్ ఇండియా డైరెక్టర్
రోబోకు డూట్ కస్టమ్-మేడ్ సర్వో మోటారు అమర్చి ఉంటుంది. ఇది ఉండటం వల్ల ఆ రోబో వంగడానికి సులభమవుతుంది. అలాగే ఇది 140 డిగ్రీల కోణంలో తనను తాను మలుపు తిప్పగలుగుతుంది. డూట్ రోబోకు తలపై హెచ్డీ కెమెరాలు ఉండటం వల్ల.. సమావేశానికి వచ్చిన ప్రేక్షకులు, హాజరైనవారిని రికార్డ్ చేయడానికి వీలు కులుగుతుంది. ఇది దేశంలోనే ఉన్న ఏకైక మానవరూపం రోబో అని చెప్పారు కన్హయ్య సింగ్.
'రోబోలో వినియోగించే నాలుగో తరం సర్వో మోటార్లు దేశీయంగా తయారవుతాయి. భారతీయ పరిస్థితుల్లో ఎలాంటి సర్వీసింగ్ అవసరం లేకుండా ఎక్కువకాలం పనిచేస్తాయి. కరోనా వల్ల రాజకీయ నాయకులు తమ పార్టీ కార్యకర్తలను కలవలేకపోతున్నారు. ఈ రోబో హ్యూమనాయిడ్లను ఓకే సమయంలో పలు చోట్ల మోహరించడం వల్ల.. అన్ని ప్రదేశాలకు సందేశం వెళుతుంది. సమయం ఆదా అవుతుంది.' అని సింగ్ వివరించారు.
సంతోష్ హౌలవాలే సృష్టికర్త
హ్యూమనాయిడ్ రోబోను ముంబయికి చెందిన ఇన్నోవేటర్ సంతోష్ హౌలవాలే అభివృద్ధి చేశారు. అనంతరం వన్ స్టాండ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
సంతోష్ ఇంతకుముందు కరోనా రోగులకు చికిత్స చేయడానికి, ఆరోగ్య కార్యకర్తలకు రోబోలను తయారు చేశారు.
ప్రచారానికి రోబోలను వినియోగించడం వల్ల కొత్తదనం సంతరించుకోవడమే కాకుండా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కూడా దోహదపడుతుందని సింగ్ తెలిపారు.