రహదారులపై మిలిటరీ విమానాల అత్యవసర ల్యాండింగ్.. రైళ్లలో సైన్యానికి చెందిన భారీ పరికరాల తరలింపు.. ఇలాంటివి అమెరికా వంటి దేశాల్లో చూసే ఉంటాం. ఆయా దేశాల్లో.. పౌర సేవలు- సైనిక అవసరాలకు అనువుగా మౌలిక వసతులను తీర్చిదిద్దారు. భారత్‌లోనూ ఇలాంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావించినా.. అది ఓ ఆలోచనగానే మిగిలిపోయింది. పరీక్షలు చేసినా, సరైన ఫలితాలు దక్కినా ఈ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. అయితే.. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు తీవ్రంగా పరిగణించినట్టు కనిపిస్తోంది. సైన్యానికి ఉపయోగపడే విధంగా.. మౌలిక వసతులను రెండు విధాలుగా(పౌర సేవలు- మిలిటరీ) వినియోగించాలని కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈసారైనా ఇది సాధ్యపడుతుందా?
గతంలోనే...
ఈ ప్రక్రియకు పునాది 2015లోనే పడింది. 2015 మే 21న, మిరాజ్ 2000 ఎయిర్‌క్రాఫ్ట్ యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ల్యాండ్ అయ్యింది. హైవేలపై యుద్ధ విమానాలు ల్యాండింగ్- టేకాఫ్ అయ్యే వేసులుబాటు ఉందా? లేదా? అన్న విషయాన్ని అప్పుడు పరీక్షించారు. యుద్ధం సమయంలో హైవేలను ఉపయోగించుకునేందుకు ఈ చర్యలు చేపట్టారు.
ఆ తర్వాత కూడా ఇదే విధంగా ప్రయత్నాలు జరిగాయి. 2017 నవంబర్‌లో.. మూడు మిరాజ్ 2000 విమానాలు, మూడు సుఖోయ్ యుద్ధ విమానాలు.. ఎక్స్‌ప్రెస్ వేపై ల్యాండ్ అయ్యాయి.
ఇదీ చూడండి:- 'రక్షణ'లో ఆత్మనిర్భరం.. భారత్‌కు సాధ్యమేనా?
2017 అక్టోబర్ 24న.. ఐఏఎఫ్‌కు చెందిన ఓ భారీ విమానం ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్ వై మీద టచ్‌డౌన్ చేసింది. ఆ సమయంలో అందులో మూడు జాగ్వార్లు, 12- మల్టీ రోల్ ఎయిర్ సుపీరియారిటీ మిరాజ్-2000 విమానాలు, ఓ సుఖోయ్-30, ఓ సీ-130జే సూపర్ హెర్కులెస్ ఎయిర్లిఫ్టర్లు ఉన్నాయి. సైనిక సన్నద్ధతలో భాగంగా ఈ విధంగా శిక్షణ ఇచ్చారు.
యుద్ధం సమయంలో.. సైన్యానికి చెందిన విమానాలను సాధారణ విమానాశ్రయాల్లో దింపడం కష్టమవుతుంది. ప్రత్యర్థి లక్ష్యం ఎప్పుడూ అలాంటి రద్దీ విమానాశ్రయాలపైనే ఉంటుంది. అందుకే ఇలాంటి ఎయిర్‌స్ట్రిప్స్‌తో ఎంతో ఉపయోగం ఉంటుందని సైన్యం భావిస్తోంది.
పొరుగు దేశాలు...
నిజానికి.. మౌలిక వసతులను సైన్యం ఉపయోగించుకునే విషయంపై భారత్ కొంత వెనుకబడి ఉంది. చైనా, పాకస్థాన్ ఎన్నో ఏళ్ల ముందే.. తమ యుద్ధ విమానాలను హైవేపై దింపాయి. ముఖ్యంగా.. ఇస్లామాబాద్- లాహోర్ హైవేపై పాక్ 17ఏళ్ల ముందే ఈ పరీక్షలు నిర్వహించింది.
ఇదీ చూడండి:- చైనా-ఇరాన్ ఒప్పందంతో భారత్‌కు ఇక్కట్లే
భారత్ కూడా...!
మౌలిక వసతులను రెండు విధాలుగా ఉపయోగించుకునే అంశంపై త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ఇటీవలే స్పందించారు. ఈ వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించినట్టు.. వివేకానంద ఇండియా ఫౌండేషన్‌లో చేసిన ప్రసంగంలో సంకేతాలిచ్చారు.
"మౌలిక వసతులను పౌర సేవలు-మిలిటరీకి కలిపి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణ-మిలిటరీ విమానాశ్రయాలను అనుసంధానించే విషయాన్ని పరిశీలించాలి. దీని వల్ల ఏవియేషన్ విభాగం శక్తిమంతంగా మారుతుంది. యుద్ధం సమయంలో ఉపయోగపడుతుంది. అదే విధంగా.. రిమోట్ సెన్సింగ్, సమాచారం, నేవిగేషన్లో సైనిక అవసరాలకు తగ్గట్టుగా ఉపగ్రహాలను తీర్చిదిద్దాలి. సైన్యానికి చెందిన భారీ పరికరాలు, ఏఎఫ్‌వీ(ఆర్మడ్ ఫైటింగ్ వెహికిల్స్)ను రవాణా చేసే విధంగా రైళ్ల(సరకు రవాణా)ను రూపొందించాలి."
--- బిపిన్ రావత్, త్రిదళాధిపతి.
సాయుధ దళాల అవసరాలు, వినియోగానికి తగ్గట్టుగా.. సరిహద్దు రాష్ట్రాల్లో.. రోడ్లు, వంతెనలు, సొరంగాల్లో విద్యుత్‌కు చెందిన మౌలిక వసతులను నిర్మించాలని రావత్ పేర్కొన్నారు.
సీడీఎస్ స్థాయి వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యానించడం సర్వత్రా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వానికి కూడా ఇవే ఆలోచనలు ఉన్నట్టు ఆయన మాటల ద్వారా తెలుస్తోందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(సంజీవ్ బారువా-సీనియర్ పాత్రికేయులు)