ఇటీవల కాలంలో మెడికల్ డ్రోన్ల వినియగం కోసం ముమ్మర కసరత్తు జరుగుతోంది. మారుమూల ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు, ఔషధాల సరఫరా కోసం డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధానం రానున్న రోజుల్లో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు.
వీటిని వాడటం ఎంత వరకు సురక్షితమనే విషయంపై కూడా చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు పలు పరిశోధనలు కూడా జరిగాయి. ఈ అంశంపై ఏషియన్ సొసైటీ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అధ్యక్షుడు డాక్టర్ తమోరిశ్ కోలే 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు. మెడికల్ డ్రోన్ల వినియోగంపై చేసిన పలు పరిశోధనల వివరాలను ఆయన విశ్లేషించారు.
దేశీయంగా 2015లోనే టాయ్ డ్రోన్ ద్వారా హైదరాబాద్‌లోని అపోలో హెల్త్ సిటీ విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించిందని గుర్తు చేశారు కోలే.
'డ్రోన్లకు అమర్చిన టెంపరేచర్ కంట్రోల్ బాక్సుల్లో.. ఎర్ర రక్త కణాలు, ప్లేటెట్ యూనిట్లు, ప్లాస్మా యూనిట్లను 24 గంటల్లో కావాల్సిన ప్రాంతానికి సరఫరా చేసినా.. ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదు. 2017లో అముకేలి అనే సంస్థ చేసిన ఓ పరిశోధనలో ఇది స్పష్టమైంద'ని డాక్టర్ కోలే వివరించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలు కాపాపడేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరా, కొవిడ్ 19 టీకాలను పంపించడమే కాకుండా.. కరోనా టెస్ట్ శాంపిళ్లను కూడా సురక్షితంగా సేకరించే వీలుందన్నారాయన. ఎక్కువ మంది చేతులు మారకుండా ఆ శాంపిల్స్ నేరుగా పరిక్షా కేంద్రానికి తరలించేందుకు వీలవుతుందని వివరించారు.
ఈ సానుకూలత నేపథ్యంలో దేశీయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మెడికల్ డ్రోన్ల వినియోగం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే 'మెడిసిన్ ఫ్రం ది స్కై' పేరుతో డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరాను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మారుమూల ప్రాంతాలకు మెడిసిన్, కరోనా వ్యాక్సిన్‌ను డెలివరీ చేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.
ట్రయల్ ఇలా..
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో సెప్టెంబర్ 11న డ్రోన్ల ద్వారా ఔషధాల పంపిణీ ప్రయోగాత్మంగా ప్రారంభమైంది. ఔషధాలు నింపిన రెండు డ్రోన్లు (బ్లూ డాట్, టెక్ ఈగల్) 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతీయ ఆసుపత్రికి 5 నిమిషాల్లో మందులను తీసుకెళ్లాయి. మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్ట్ ట్రయల్స్ ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి.
ఈ మెడికల్ డ్రోన్ ట్రయల్ విజయవంతమైన నేపథ్యంలో.. మరిన్ని ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహించేందుకు పౌర విమానయాన శాఖ.. ఐసీఎంఆర్ (భారత వైద్యపరిశోధన మండలి)కు అనుమతులు ఇచ్చింది.
ముఖ్యంగా రోడ్డు రవాణా వ్యవస్థ క్లిష్టంగా ఉండే.. అండమాన్ అండ్ నికోబార్ దీవులు, మణిపూర్, నాగాలాండ్ వంటి ప్రాంతాల్లో ట్రయల్స్‌కు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. 3 కీలో మీటర్ల దూరం వరకు డ్రోన్ల ద్వారా ఔషధాలు సరఫరా చేసేందుకు ఐసీఎంఆర్ సముఖత వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: 'ఆర్' వ్యాల్యూతో ఊరట.. తగ్గుతున్న కరోనా కేసులు!