భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్(kulbhushan jadhav) తన మరణ శిక్షపై అపీల్ చేసుకునే హక్కుకు అవకాశం కల్పించే బిల్లులో లోపాలు ఉన్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. పాక్‌లో సజావుగా కేసుల దర్యాప్తు జరుగుతోందనే వాతావరణాన్ని ఆ దేశం సృష్టించలేకపోయిందన్నారు. జాదవ్‌కు దౌత్యసాయం అందించే విషయంలో పాక్ మోకాలడ్డుతోందన్నారు.
జాదవ్.. తన మరణ శిక్షపై అపీల్ చేసుకునే హక్కుకు అవకాశం కల్పించేందుకు అంతర్జాతీయ కోర్టు ఆదేశాల మేరకు.. ఓ బిల్లును పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఓ బిల్లు ఆమోదించింది.
ఆ న్యాయస్థానం ఆదేశాలతో...
గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై కుల్‌భూషణ్‌కు 2017లో పాకిస్థాన్ మరణశిక్ష విధించింది. శిక్షను అపీల్ చేసుకునేందుకు వీలుగా ఆయనకు దౌత్యపరమైన సంప్రదింపులకు అవకాశం కల్పించకపోవడంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించింది.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కుల్‌భూషణ్ మరణశిక్షను పునఃసమీక్షించడం సహా అపీల్‌కు వీలుగా భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని 2019లో పాక్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పాక్ జాతీయ అసెంబ్లీ సంబంధిత బిల్లును ఆమోదించింది.
ఇదీ చూడండి: ఆగని చైనా దురాక్రమణలు.. అరుణాచల్‌ప్రదేశ్‌లో మరో గ్రామం!