INDIA COVID CASES: కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 1,033 కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 43 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 12 వేల దిగువకు పడిపోయింది. 1,222 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
• యాక్టివ్ కేసులు: 11,639
• మరణాలు: 5,21,530
• మొత్తం కేసులు: 4,30,31,958
• రికవరీలు: 4,24,98,789
India vaccination: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 15,37,314 మందికి మంగళవారం టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 185.20 కోట్లకు చేరింది.
• మంగళవారం 4,82,039 కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid cases: ప్రపంచవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 12,02,598 కేసులు వెలుగులోకి వచ్చాయి. 3,574 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియాలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటోంది. కొత్తగా 2.86 లక్షల కేసులు నమోదయ్యాయి. 372 మంది వైరస్‌కు బలయ్యారు. జర్మనీలో సైతం రెండు లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 333 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా, వియత్నాం, జపాన్ దేశాల్లో వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా ఉంది.
అయితే, వరుసగా రెండో వారం కొవిడ్ కేసుల సంఖ్య పడిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) బుధవారం పేర్కొంది. క్రితం వారం కంటే కొవిడ్ మరణాలు కూడా తగ్గినట్లు తెలిపింది. ఈమేరకు మహమ్మారిపై తాజాగా విడుదల చేసిన వారాంతపు నివేదికలో పలు అంశాలను వెల్లడించింది. ఈ వారంలో ప్రపంచంలో 90 లక్షల కేసులు, 26 వేల మరణాలు నమోదయ్యాయని, క్రితం వారంతో పోలిస్తే కేసులు 16% తగ్గాయని పేర్కొంది. అన్ని ప్రాంతాల్లోనూ కేసుల్లో తగ్గుదల ఉన్నట్లు పేర్కొంది. అయితే చాలా దేశాల్లో విస్తృతస్థాయిలో పరీక్షలు జరపడం లేదని.. అందువల్ల ఈ కేసుల సంఖ్యలో కొంత అనిశ్చితి ఉందని పేర్కొంది. ఈమేరకు బయటపడని కేసులు చాలా ఉండొచ్చని హెచ్చరించింది. ఈ సందర్భంగా ఒమిక్రాన్‌లోని కొత్త 'రీకాంబినంట్' వేరియంట్ 'ఎక్స్‌ఈ' గురించి వివరించింది. బ్రిటన్‌లో జనవరిలో బయటపడిన ఈ రకం మునుపటి వేరియంట్ల కంటే 10% ఎక్కువ సాంక్రమిక శక్తి కలిగి ఉండొచ్చని ముందస్తు అంచనాల్లో తేలిందని పేర్కొంది. అయితే ఇది తేల్చేందుకు మరిన్ని ఆధారాలు అవసరమని తెలిపింది. దేశాలు కొవిడ్ నిబంధనలను త్వరగా ఉపసంహరించవద్దని సూచించింది. వైరస్‌పై నిఘా, పరీక్షలు తగ్గిస్తే భవిష్యత్తులో వేరియంట్లు సులువుగా వ్యాప్తిచెందే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.
ఇదీ చదవండి: భారత్‌లో చిచ్చుకు అల్‌ఖైదా యత్నం.. 'హిజాబ్ యువతి'పై ప్రశంసలు