సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు కృషి చేయాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఈ మేరకు మరోసారి సైనిక స్థాయి చర్చలు త్వరలోనే నిర్వహించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు.
ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతుందని.. దౌత్య, సైనిక స్థాయి చర్చలతోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
డిసెంబర్ 18న భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై 'వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్' (డబ్ల్యూఎంసీసీ) పద్ధతిలో ఇరు దేశాల మధ్య వర్చువల్‌గా చర్చలు జరిగాయి. ఆ భేటీలోనే తొమ్మిదో దఫా సైనిక చర్చలు జరపాలని నిర్ణయించినట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు.
భారీగా బలగాల మోహరింపు..
భారత్-చైనా మధ్య ఎల్ఏసీ వెంబడి 7 నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. తూర్పు లద్దాఖ్‌లోని కీలక ప్రాంతాల్లో శీతాకాలంలోనూ యుద్ధ సన్నద్ధతను ముమ్మరం చేసింది భారత్. ఇందుకోసం 50 వేల వరకు బలగాలను మోహరించింది. అలాగే.. ఎల్ఏసీకి అవతలివైపు చైనా కూడా అదే స్థాయిలో సైన్యాన్ని మోహరించినట్లు అధికారులు తెలిపారు.
చివరిసారిగా నవంబర్ 6న ఎనిమిదో దఫా సైనిక చర్చలు జరిగాయి. నిర్దిష్ట ఘర్షణ పాయింట్ల వద్ద నుంచి బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా చర్చించాయి.
ఇదీ చూడండి: 'చైనాతో వివాదం ఎప్పుడు ముగుస్తుందో ఊహించలేం'