రానున్న మూడు వారాల్లోనే.. కరోనా వైరస్ పాజిటివిటీ రేటును 5 శాతం కంటే తక్కువకు భారత్ పరిమితం చేయగలుగుతుందని దిల్లీ ఎయిమ్స్‌లోని ఔషధ విభాగాధిపతి డాక్టర్ నవనీత్ విగ్ పేర్కొన్నారు. అయితే.. ఇందుకు అందరూ బాధ్యతాయుతంగా కొవిడ్‌పై పోరు సాగించాలని తెలిపారు. కరోనా పరిస్థితులపై ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, డీజీహెచ్ఎస్ డైరెక్టర్ జనరల్ సునీల్ కుమార్, ఛైర్మన్ డాక్టర్ నరేష్ త్రెహాన్ల సంయుక్త సమావేశంలో డాక్టర్ నవ్‌నీత్ పాల్గొన్నారు.
"కొవిడ్‌ను ఎదుర్కోవడంలో మనమంతా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే... భారత్‌లో వైరస్ పాజిటివిటీ రేటును 5 శాతం కంటే తక్కువకు పరిమితం చేయవచ్చు. అన్ని జిల్లాల అధికారులు.. జిల్లాలోని పాజిటివిటీ రేటును పర్యవేక్షించాలి, 1-5 శాతానికి పరిమితం చేసేలా చర్యలు తీసుకోవాలి. ముంబయిలో ఒకానొక దశలో వైరస్ పాజిటివిటీ రేటు 26 శాతంగా ఉండేది. కొన్ని కఠిన చర్యలు చేపట్టిన తర్వాత.. అది 14 శాతానికి చేరింది. దిల్లీలో ప్రస్తుతం వైరస్ పాజిటివిటీ రేటు 30 శాతంగా ఉంది. మనం తప్పనిసరిగా కఠిన నిబంధనలు అమలు చేయాలి."
-నవ్‌నీత్ విగ్, దిల్లీ ఎయిమ్స్ ఔషధ విభాగాధిపతి.
వ్యాధిని ఓడించాలంటే ముందు ఆరోగ్య సిబ్బందిని కాపాడుకోవాలని నవ్‌నీత్ విగ్ పేర్కొన్నారు. "ఆరోగ్య సిబ్బందిని కాపాడితేనే.. వాళ్లు రోగులను కాపాడుతారు. వాళ్లిద్దరినీ మనం కాపాడినట్లైతే.. ఆర్థిక వ్యవస్థను వాళ్లు కాపాడుతారు"అని చెప్పారు.
ఇదీ చూడండి: కరోనా ఆంక్షల మధ్య యువకుడి 'బైక్ బరాత్'
ఇదీ చూడండి: వ్యాక్సినేషన్ 3.0పై కేంద్రం కీలక మార్గదర్శకాలు