ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వ్యక్తి చేసిన పనికి ఒక్కసారిగా వైద్యులు షాకయ్యారు. ఉన్నావ్ జిల్లాకు చెందిన ఓ మహిళను పాము కాటేసింది. వెంటనే బిగ్గరగా ఆమె కేకలు పెట్టింది. అక్కడే ఉన్న ఆమె భర్త ఆ పామును ఓ బాటిల్లో బంధించి.. బాధితురాలితో పాటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. 'పామును ఎందుకు తీసుకొచ్చావ్?' అని వైద్యులు అడిగితే అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.
ఇదీ జరిగింది.. ఉన్నావ్‌లోని రౌ అఫ్జల్ నగర్‌లో నివాసం ఉంటున్న రామేంద్ర యాదవ్ భార్య గురువారం రాత్రి ఇంటిలో పనులు చేసుకుంటుంది. ఆ సమయంలో హఠాత్తుగా ఆమెను ఓ పాము కాటు వేసింది. భార్య కేకలు విని అక్కడకు వచ్చిన భర్త.. ఆ పాము పట్టుకునన్నాడు. దానిని ఓ బాటిల్లో బంధించాడు. సీసాలోని పాము చావకుండా గాలి లోపలికి వెళ్లేలా రంధ్రాలు చేశాడు.
ఆ తర్వాత భార్యతో పాటు ఆ బాటిల్‌ను తీసుకుని జిల్లా ఆసుపత్రికి వెళ్లాడు రామేంద్ర. వైద్యులు వెంటనే ఆమెకు చికిత్స ప్రారంభించారు. అయితే బాటిల్లో పామును చూసి వైద్యులు షాకయ్యి 'ఎందుకు తీసుకొచ్చావు?' అని అడిగారు. అందుకు రామేంద్ర.. 'ప్రతిసారి పాము కాటు వేసినప్పుడు.. ఏ పాము అని అడుగుతారు అందుకే ఈ సారి పామును పట్టుకుని మరీ తీసుకొచ్చాను' అని చెప్పాడు. అనంతరం ఆ పామును అడవిలో వదిలేశాడు. బాధితురాలి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు.
ఇవీ చదవండి: భూమి-భుక్తి కోసం బ్రిటిష్ సైన్యాన్నే ఢీకొట్టారు