ఉత్తరాది రాష్ట్రం బిహార్‌లో కరోనా మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. గత లెక్కలతో పోలిస్తే ఏకంగా 72శాతం అధికంగా మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు సవరించిన మృతుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. మంగళవారం నాటికి రాష్ట్రంలో మొత్తం 5,500 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. అయితే, అన్ని జిల్లాల నుంచి వెరిఫికేషన్ తర్వాత రాష్ట్రంలో మరో 3,951 మంది కరోనాకు బలైనట్లు బుధవారం తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్యను 9,429గా ప్రకటించింది. అయితే ఈ మరణాలు ఎప్పుడెప్పుడు నమోదయ్యాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
దాచిపెడుతోందనే ఆరోపణలు..
రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలను ప్రభుత్వం దాచిపెడుతోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏప్రిల్- మే నెలల్లో కొవిడ్ మరణాలపై ఆడిట్ నిర్వహించాలని పట్నా హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు మూడు వారాల పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సవరించిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 1,600 మంది ఈ వైరస్‌తో ప్రాణాలు కోల్పోగా.. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఈ సంఖ్య ఏకంగా ఆరు రెట్లు పెరిగి 7,775గా తేలింది.
లెక్కకు మించి ఉండొచ్చని..
ఇక తాజా గణాంకాల ప్రకారం.. రాజధాని పట్నాలో అత్యధికంగా 2,303 మంది కరోనాతో చనిపోయారు. అదనంగా నమోదైన మరణాల్లోనూ అత్యధికంగా ఇక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పట్నాలోని మూడు ప్రభుత్వ అధీన శ్మశాన వాటికల రికార్డుల ప్రకారం మూడువేలకు పైనే అంత్యక్రియలు జరిగినట్లు తెలుస్తోంది. అంటే.. తాజా లెక్కల కంటే ఇంకా ఎక్కువ మరణాలు సంభవించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్నా తర్వాత ముజఫర్‌పూర్‌లో 609 మంది కరోనాతో మృతిచెందారు.
ఇక రికవరీలను కూడా ప్రభుత్వం తగ్గించింది. మంగళవారం నాటికి 7.01లక్షలు మంది కోలుకున్నట్లు చెప్పిన రాష్ట్ర ఆరోగ్యశాఖ.. బుధవారం ఆ సంఖ్యను 6,98,397గా ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 7.15లక్షల మంది కరోనా బారినట్లు పడినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: Covid-19: దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా మరణాలు
ఇదీ చూడండి: Black Fungus: వ్యాధికి చికిత్స ఉందా?