దేశంలో అందుబాటులోకి రానున్న కొవిడ్-19 వ్యాక్సిన్లలో ఏది ఉత్తమమో, ఏది అన్ని విధాల సరిపడేదో తెలుసుకునేందుకు అనేక వ్యాక్సిన్లను పరీక్షించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) సెక్రటరీ రేణు స్వరూప్ సూచించారు. వివిధ సంస్థలు దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఈ టీకాలు వేటికవే తమవైన లాభనష్టాలను కలిగి ఉన్నాయన్నారు. మొట్టమొదట లభించిందే ఉత్తమమైనది కావాల్సిన అవసరం లేదని.. తరువాత అందుబాటులోకి వచ్చే టీకా మరింత మంచిదయ్యే అవకాశం లేకపోలేదని ఆమె విశ్లేషించారు. వాటిలో ఏది మంచిదనేది ఇప్పుడే వెల్లడించటం కష్టసాధ్యమని వివరించారు.
వ్యాక్సిన్‌తయారీ అనేది నిజానికి సంక్లిష్టమైన విధానమని.. ఇందుకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం అవసరమైతుందని రేణు స్వరూప్ అన్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగాలను గమనించేందుకు డీబీటీ దేశ, విదేశాలకు చెందిన ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని ఆమె తెలిపారు. ఈ కమిటీ ప్రతి రెండు వారాలకు ఒకసారి సమావేశమై దేశంలో కొవిడ్ టీకా పురోగతిని గురించి సమీక్ష జరుపుతుందని తెలిపారు.
దేశంలో ప్రస్తుతం 30 కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు కొనసాగు తున్నాయి. వాటిలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మూడో దశ ప్రయోగాల్లో ఉండగా.. భారత్ బయోటెక్ కూడా మూడోదశ ప్రయోగాల్లోకి ప్రవేశించింది. మరో ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలాకు ఇటీవలే అనుమతులు లభించాయి.
ఇదీ చూడండి:'కొవిడ్ టీకాకు భారత్ అతిపెద్ద కొనుగోలుదారు'