Importance of Bhogi Pallu During Sankranti : తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొనే పెద్ద పండగ సంకాంత్రి. చిన్న, పెద్దా తేడా లేకుండా మూడు రోజుల పాటు ఈ పండగ సంబరాల్లో మునిగితేలుతారు. ఇకపోతే సంక్రాంతి ముందు రోజున భోగిని జరుపుకుంటారు. గ్రామాల్లో ఈ రోజున కుటుంబ సభ్యులందరూ తెల్లవారు జామునే లేచి భోగి మంటలు వేస్తారు. పాత వస్తువులన్నీ ఆ మంటల్లో వేసి.. అంతా మంచి జరగాలని కోరుకుంటారు.
Bhogi Pallu Festival 2024 : భోగి మంటల చుట్టూ చేరి ఆట పాటలతో సందడి చేస్తారు. ఆ తర్వాత భోగి మంటలపై పాత్రలతో నీళ్లు వేడిచేసుకుని అందులో కొన్ని నల్లటి నువ్వులు, రేగిపండ్లు వేసుకొని ఇంటిల్లిపాది స్నానాలు చేస్తారు. ఇలా చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు అంటుంటారు. ఇలా భోగి(Bhogi 2024) రోజు ఉదయమంతా భోగి మంటలు, నువ్వులు, పల్లీలతో చేసిన పులగం, పాయసం లాంటి తీపి వంటకాలు చేసుకుని ఆరగిస్తూ బంధుమిత్రులందరితో సందడిగా గడిపితే.. ఆ రోజు సాయంత్రం చిన్న పిల్లలపై భోగి పండ్లను పోస్తారు. ఇప్పటికీ చాలా మందికి భోగి రోజు చిన్న పిల్లలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారో తెలియదు? మీరు ఆ జాబితాలో ఉన్నారా? అయితే మీరు ఇది చదవాల్సిందే..
భోగి పళ్లను ఎలా తయారుచేస్తారంటే.. భోగి అనగానే చాలా మందికి భోగి మంటలతో పాటు పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే రేగుపళ్లు గుర్తుకువస్తాయి. అవే రేగుపళ్లు కాస్తా ఆ రోజు భోగి పళ్లుగా మారుతాయి. ఈ భోగిపండ్ల కోసం రేగుపండ్లు, బంతిపూల రెక్కలు, చెరుకుగడలు, చిల్లర నాణేలు కలిపి వాడతారు. ఇకపోతే కొందరు శనగలు కూడా ఈ పండ్లలో కలుపుతారు. ముందుగా పిల్లలకు కొత్త దుస్తులు వేసి వారిని అందంగా రెడీ చేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీయిస్తారు. అనంతరం సిద్ధం చేసుకున్న భోగి పండ్లను గుప్పిట నిండుగా తీసుకుని పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పి వారి తల మీద పోసి ఆశీర్వదిస్తారు. ఇలా పోసిన పండ్లను ఎవరూ తినరు. అయితే ఈ విధంగా పిల్లల మీద భోగి పండ్లు పోయడం వెనుక ఒక అంతరార్థం ఉంది. అదేంటంటే..
భోగి రోజున రేగి పళ్లను పిల్లల తల మీద పోడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని ప్రజలు భావిస్తారు. అంతే కాకుండా.. పురాణాల ప్రకారం.. బదరీ వనంలో పరమ శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు నరనారాయణులు ఘోర తపస్సు చేశారట. ఆ టైమ్లో వారి తపస్సుకు మెచ్చిన దేవతలు వారి తలల మీద బదరీ పళ్లను కురిపించారని నానుడి. ఈ బదరీ పళ్లనే రేగు పండ్లు అని కూడా పిలుస్తారు. అప్పటి సంఘటనకు గుర్తుగా చిన్నపిల్లలను నారాయణుడిగా భావించి సంక్రాంతి ముందు రోజు భోగి పండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి.
అదే కాకుండా భోగి పండ్లు పోయడం ద్వారా తమ పిల్లల మీద ఉన్న చెడు దృష్టి, దిష్టి తొలగిపొతుందని ప్రజల విశ్వాసం. ప్రతి ఒక్కరి తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందట.. ఇలా పిల్లల తలపై భోగి పండ్లు పోసి దాని ప్రేరేపితం చేస్తే.. వారిలో జ్ఞానం పెరుగుతుందని, ఆరోగ్యంగా జీవిస్తారని పెద్దల నమ్మకం.
సంక్రాంతి- నాలుగు రోజుల పండగంట! మీకు తెలుసా మరి?
ఈ సంప్రదాయం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఇక ఐదేళ్ల లోపు పిల్లలకి ఈ భోగి పళ్లను పోస్తారు. ఈ వయసు ఉన్న పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే జీర్ణవ్యవస్థ, ఊపిరితిత్తులూ చాలా బలహీనంగా ఉంటాయి. ఈ సమయంలో పోసే భోగి పళ్లు నిజంగా చిన్న పిల్లల పాలిట అమృతంలా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి రేగుపళ్లలో అధికంగా ఉంటుంది. అదేవిధంగా రేగు పళ్లు జీర్ణసంబంధమైన వ్యాధులను నివారించేందుకు, ఉదరసంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇదండీ భోగి రోజు పిల్లలపై రేగుపళ్లు పోయడంలో ఉన్న అసలు సంగతి. కాబట్టి మీరు కూడా ఈ భోగి రోజు మీ పిల్లలపై తప్పకపోయండి.
సంక్రాంతి స్పెషల్- నోరూరించే అరిసెలు, బూందీ లడ్డూ! చేయడం చాలా ఈజీ!