అలోపతి వైద్యంపై యోగా గురు రాందేవ్(Ramdev) బాబా ఇటీవల చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ దిల్లీ సహా పలు ప్రాంతాల్లో రెసిడెంట్ డాక్టర్లు మంగళవారం ఆందోళనలు చేపట్టారు. నల్లటి బ్యాండ్లు, రిబ్బన్లు ధరించి.. ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. మంగళవారాన్ని 'చీకటి దినం'గా పాటించారు.
ఆందోళనలకు మద్దతుగా పలువురు వైద్యులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. రాందేవ్(Ramdev) బాబా బేషరతుగా, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని.. లేనిపక్షంలో ఆయనపై అంటువ్యాధుల చట్టం-1897 కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాందేవ్(Ramdev) వ్యాఖ్యలు వైద్యుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ల సమాఖ్య (ఎఫ్‌వోఆర్‌డీఏ) సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి, హిందూ రావ్ ఆస్పత్రి, సంజయ్ గాంధీ స్మారక ఆస్పత్రి రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్లు (ఆర్‌డీఏ) సహా పలు ఆర్‌డీఏలు ఆందోళనల్లో పాల్గొన్నాయి.
రాందేవ్ వ్యాఖ్యలతో తీరని నష్టం: ఐఎంఏ
కొవిడ్ మహమ్మారికి కళ్లెం వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి.. అలోపతిపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీరని నష్టం చేశాయని భారత వైద్య సంఘం (ఐఎంఏ) పేర్కొంది. అంటువ్యాధి ప్రబలుతున్న సమయంలో జాతీయ చికిత్స ప్రొటోకాల్‌కు సంబంధించి ప్రజల్లో గందరగోళం సృష్టించేవారు దేశ వ్యతిరేకులేనని, వారు క్షమార్హులు కారని వ్యాఖ్యానించింది. ఈ మేరకు దేశ ప్రజలకు ఐఎంఏ బహిరంగ లేఖ రాసింది.
ఇదీ చదవండి : Ramdev: రాందేవ్‌కు వ్యతిరేకంగా 1న దేశవ్యాప్త ఆందోళన