అన్ని రకాల ఔషధ వ్యవస్థలను అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) బహిరంగంగా వ్యతిరేకించింది. కేంద్రం నిర్ణయంతో ఇన్నేళ్ల శ్రమ వృథా అయ్యి దేశం తిరిగి వెనకడుగు వేస్తుందని.. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డా. ఆర్వీ అశోకన్.
ఆధునిక ఔషధ రంగాన్ని సంప్రదాయ ఔషధ వ్యవస్థలైన ఆయుర్వేదం, యోగా, హోమియోపతితో ఏకీకృతం చేసేందుకు ఇటీవలే నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది నీతి ఆయోగ్. ఫలితంగా.. వైద్య విద్య, క్లినికల్ ప్రాక్టీస్, ప్రజా ఆరోగ్యం, యంత్రాంగం, వైద్య పరిశోధనలపై ఈ ప్రభావం పడుతుంది.
"ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఈరోజున ఒక్కో పద్ధతికి ఒక్కో వ్యవస్థ ఉంది. దేనిని ఎంచుకోవాలనేది ప్రజల ఇష్టం. ఇప్పుడు విద్య నుంచి పరిశోధన వరకు అన్నింటినీ కలిపేయడం అనేది అశాస్త్రీయం. ఇది ఆధునిక- సంప్రదాయ మెడిసిన్‌కు హానికరం. ఆరోగ్య వ్యవస్థ, అది సాధించిన ఘనతపై దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది."
--- డా. అశోకన్, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి
ఆధునిక ఔషధ రంగాన్ని సంప్రదాయ వ్యవస్థలకు అనుసంధానిస్తూ జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)లో వ్యూహాలు రచించింది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం. దీనిని తప్పుబడతూ ఇప్పటికే కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాసింది ఐఎంఏ. దీని ద్వారా సంప్రదాయ ఔషధ వ్యవస్థలు లబ్ధిపొందుతాయనుకుంటే పొరబడినట్టేనని పేర్కొన్నారు డా. అశోకన్.
ఇదీ చూడండి:- పార్లమెంటులో కేంద్రం ప్రకటనపై ఐఎంఏ ఆగ్రహం