ఆధునిక వైద్యం, కరోనా వ్యాక్సిన్లపై బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే.. ఆయనపై పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరిచుకునే అంశాన్ని భారతీయ వైద్య సంఘం పరిశీలిస్తుందని ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్ జేఏ జయలాల్ తెలిపారు. అలాగే పరువు నష్టం నోటీసులనూ వెనక్కు తీసుకుంటామని స్పష్టం చేశారు.
"యోగా గురువు బాబా రాందేవ్‌కు మాకూ మధ్య వివాదమేమీ లేదు. ఆయన ప్రకటనలు కరోనా టీకా పంపిణీ విధానానికి మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే.. ఆ ప్రకటనలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తాయి. తన అనుచరులను టీకాలు వేయించుకోవాలని సలహా ఆయన ఇవ్వాలి. మహమ్మారికి వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి. ఇప్పటికే కరోనా చికిత్సకు సంబంధించి ఆధునిక ఔషధాలపై చేసిన వ్యాఖ్యలను రాందేవ్ ఉపసంహరించుకున్నారు. ప్రస్తుత వివాదానికీ ముగింపు పలకాల్సి అవసరం ఉంది."
-డాక్టర్ జయలాల్
ఐఎంఏ కేవలం ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను అనుసరిస్తుందని.. అందువల్ల ఈ అంశంలో ఎవరైనా ప్రశ్నలు లేవనెత్తారంటే నిజానికి వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లేనని జయలాల్ వివరించారు. కరోనా టీకా సమర్థతపై సందేహాం వ్యక్తం చేసిన నటుడు మన్సూర్ అలీ ఖాన్‌ను ఇటీవల తమిళనాడులో అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాందేవ్ లాంటి ప్రముఖుల వాఖ్యల వల్ల ప్రజలు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఇవీ చదవండి: 'బాబా మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి'