హౌసింగ్ సొసైటీల్లో కరోనా టీకా డ్రైవ్‌లు జరుగుతున్నప్పుడు.. వృద్ధులు, ప్రత్కేక అవసరాలు కలిగిన వ్యక్తులకు టీకా అందించేందుకు అధికారులు ఎందుకు ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నారని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై న్యాయవాదులు ధృతి కపాడియా, కునాల్ తివారీలు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 75 ఏళ్లు పైబడిన వారు టీకా కేంద్రాలకు వెళ్లే స్థితిలో ఉండరని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అనేక హౌసింగ్ సొసైటీలు ప్రైవేటు ఆసుపత్రులతో కలసి టీకా డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణిల డివిజన్ బెంచ్ గుర్తుచేసింది. ఇది సాధ్యమైనప్పుడు ప్రభుత్వాధికారులు సైతం ఒక అడుగు ముందుకు వేసి.. టీకా కేంద్రాలకు వెళ్లలేని వారి కోసం.. ఇళ్ల వద్దకు వెళ్లే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు కదా? అని జస్టిస్ దత్తా ప్రశ్నించారు.
కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ దీనికి మరింత సమయం కావాలని కోరారు. తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది కోర్టు.
ఆర్భాటాలు ఎందుకు?
కొవాగ్జిన్ రెండు డోసులను నిర్ణీత సమయం లోపు అందించలేనప్పుడు అది టీకా పంపిణీ కేంద్రాలను పెద్దఎత్తున ఎందుకు ప్రారంభించారని దిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండో డోసు టీకాలు లభించట్లేదని దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ రేఖ ధర్మాసనం దిల్లీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేశారు. రెండు డోసుల మధ్య ఆరు వారాల సమయం ముగిసేలోగా.. రెండో డోసు అందించగలరా? లేదా? అనే అంశంపై ప్రభుత్వానికి స్పష్టత ఉందా? అని ప్రశ్నించారు.
"రెండో డోసు లభ్యత పట్ల స్పష్టత లేకపోతే టీకా కేంద్రాలను ఆర్భాటంగా ఎందుకు ప్రారంభించారు? ఆపేయాల్సింది. అలా అందివ్వలేమని గ్రహించి మహారాష్ట్ర ఆపేసింది కదా?."
-దిల్లీ హైకోర్టు
కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండో డోసులను దేశ రాజధానిలో అందుబాటులో ఉంచాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 4న జరగనుంది.
'డిసెంబర్ నాటికి అందరికీ..'
హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) స్పందించింది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో టీకాల పంపిణీ పూర్తవుతుందని వెల్లడించింది. జులై నుంచి ప్రతి నెల సుమారు 5.5 కోట్ల కొవాగ్జిన్, 2 కోట్ల కొవిషీల్డ్ డోసులు అందుబాటులోకి వస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది.
ఇవీ చదవండి: వ్యాక్సినేషన్.. ఆ రాష్ట్రాల్లో డౌటే!