దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన ఐసీఎస్‌ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఐఎస్‌సీఈ మంగళవారం వెల్లడించింది. 10, 12వ తరగతి వార్షిక పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు గతవారమే బోర్డు ప్రకటించింది. 12వ తరగతి పరీక్షలను తర్వాత నిర్వహిస్తామని తెలిపిన సీఐఎస్‌సీఈ.. పదో తరగతికి సంబంధించి విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యే విషయంలో ఐచ్ఛికాన్ని ఇవ్వనున్నట్లు వివరించింది.
దేశంలో కొవిడ్ కేసులు విపరీతంగా ఉంటుండంతో 10వ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు బోర్డు నేడు ప్రకటనలో పేర్కొంది. గతవారం ఉత్తర్వుల్లో పేర్కొన్న ఐచ్ఛికాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఆబ్జెక్టివ్ క్రైటీరియాలో మార్కులు కేటాయించి త్వరలోనే ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపింది.
అయితే.. 12వ తరగతి పరీక్షలపై మాత్రం గతంలో ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కొవిడ్ పరిస్థితిని సమీక్షించి పరీక్షల నిర్వహణకు సంబంధించి జూన్ మొదటి వారంలో తుది నిర్ణయం తీసుకుంటామని బోర్డు వెల్లడించింది. కొవిడ్ దృష్ట్యా ఇప్పటికే సీబీఎస్‌ఈ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.