ICMR Studying Sudden Deaths : కరోనా ముప్పు తొలిగిన తర్వాత ఆకస్మిక మరణాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. జిమ్ చేస్తుండగా లేదా నడుస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలి మరణిస్తున్నారు. అయితే ఆకస్మిక మరణాలపై ICMR రెండు అధ్యయనాలను చేస్తోందని సంస్థ డైరెక్టర్ రాజీవ్ బహల్.. గుజరాత్‌లో జరిగిన ప్రపంచ సంప్రదాయ ఔషధ సదస్సులో తెలిపారు. ICMR ఇప్పటివరకు 50 పోస్టుమార్టం నివేదికలపై అధ్యయనం చేసిందని, మరో 100 నివేదికలను పరిశీలించనున్నట్లు వివరించారు. ఇది కోవిడ్ 19 వ్యాప్తి పరిణామాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని.. ఇతర మరణాలను నిరోధించే అవకాశం ఉందని బహల్ వెల్లడించారు.
ICMR మొదటి అధ్యయనంలో భాగంగా కొవిడ్ తర్వాత ఆకస్మికంగా చనిపోయిన వారి శరీరాల్లో ఏదైనా మార్పులు జరిగాయా అని పరిశీలిస్తోంది. ఆకస్మికంగా గుండె లేదా ఊపిరితిత్తుల వైఫల్యాల వల్లే అధిక మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో వీటిపై దృష్టి సారిస్తున్నట్లు బహల్ తెలిపారు. మరో అధ్యయనంలో గత ఏడాదిలో ఆకస్మికంగా మరణించిన 18–45 ఏళ్ల మధ్య వయస్కుల డేటాను ICMR విశ్లేషిస్తోంది.
దేశవ్యాప్తంగా 40 కేంద్రాల నుంచి సేకరిస్తున్న డేటాల్లో కొవిడ్ సోకడం, డిశ్చార్జ్, తదనంతరం ఏడాదిపాటు వారి ఆరోగ్యంపై సమీక్ష వివరాలు ఉంటాయని ICMR తెలిపింది. అధ్యయనంలో భాగంగా చనిపోయిన వారితో పాటు జీవించి ఉన్న వ్యక్తుల డేటాను పోల్చిచూస్తున్నట్లు చెప్పింది. జెండర్, వయస్సు, ప్రాంతం, ఆహారపు అలవాట్లు, పొగాకు వినియోగం, వ్యాక్సిన్, కుటుంబ నేపథ్యాలను అధ్యయనం చేస్తున్నట్లు వివరించింది.కోవిడ్ కాలంలో జీవనశైలిలో వచ్చిన మార్పులను కూడా పరిశీలిస్తున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
కొవిడ్ మూలాల దర్యాప్తులో కదలిక.. ఆ డేటా ఇవ్వాలని కోరిన W.H.O.
ప్రపంచాన్ని దాదాపు 3ఏళ్లు వణికించిన కరోనా మహమ్మారి గుట్టు ఇప్పటికీ వీడటం లేదు. ఈ కొవిడ్ పాపం చైనాదేనని చాలాదేశాలు ఆరోపిస్తున్నా ఆధారాలు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై కొన్నిరోజుల క్రితం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అన్ని దేశాలకు ఒక సూచన చేసింది. కొవిడ్-19 మూలాల గురించి తెలిసిన సమాచారాన్ని తమతో పంచుకోవాలని WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ అన్ని దేశాలకూ విజ్ఞప్తి చేశారు.