IAC Vikrant Commission: స్వదేశంలో నిర్మితమైన తొలి విమాన వాహకనౌక ఐఏసీ విక్రాంత్‌ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ రెండో తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో జరిగే కార్యక్రమంలో ఐఏసీ విక్రాంత్‌ను ప్రధాని మోదీ అధికారికంగా నౌకాదళంలోకి ప్రవేశపెడతారని పేర్కొన్నాయి.
స్వదేశీ సాంకేతికత:
ఐఏసీ విక్రాంత్ తయారీతో సొంతంగా ఎయిర్‌క్రాఫ్ట్ తయారు చేసుకోగల శక్తి ఉన్న అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. విక్రాంత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్, సంస్థ డిజైన్ చేసింది. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ సంస్థ తయారు చేసింది. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో పనిచేసి పదవీవిరమణ పొందిన సిబ్బంది, రక్షణ రంగ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు.. ప్రారంభోత్సవంలో పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. దాదాపు 1500 నుంచి 2000 మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపాయి.
రూ.20 వేల కోట్లతో..
ఐఏసీ విక్రాంత్‌ను కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) 20వేలకోట్లు ఖర్చుచేసి నిర్మించింది. సీఎస్ఎల్ నుంచి జులై 28న ఐఎసీ విక్రాంత్ నౌకాదళానికి చేరగా అనంతరం గత నెలలో సముద్రంలో విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించారు. ఐఏసీ విక్రాంత్ రాకతో హిందూ మహా సముద్రంలో భారత్ పట్టు మరింత పెరుగనుంది.
ప్రత్యేకతలు..
- ఐఏసీ 262 మిటర్ల పొడవు, 62 వెడల్పు, 59 మీటర్లు ఎత్తు ఉంటుంది.
- ఈ కేరియర్లో 2300 కంపార్టుమెంట్లు ఉన్నాయి. 17 వందల మంది సిబ్బంది ఉండేలా దీనిని రూపొందించారు.
- మహిళా అధికారులకు ప్రత్యేక కేబిన్లు సైతం ఏర్పాటు చేశారు.
- మిగ్-29కె ఫైటర్ జెట్లు, కమోవ్-31 హెలికాఫ్టర్లు, ఎమ్హెచ్-60ఆర్ మల్టీ రోల్ హెలికాఫ్టర్లు దీనిపై మోహరించనున్నారు.
- 28 నాటికల్ మైళ్ల వేగంతో ఆగకుండా 7500 నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు.
- దీని ఫ్లైట్ డెక్ రెండు ఫుట్ బాల్ మైదానాలంత ఉంటుంది. ఇందులోని కారిడార్లలో నడిస్తే 8 కిలోమీటర్లు ఉంటుంది.
- ఇందులో 8 పవర్ జెనరేటర్లు ఉన్నాయి. వాటితో కొచ్చి నగరానికి విద్యుత్తు అందించవచ్చు. ప్రత్యేక ఆస్పత్రితో పాటు సకల సౌకర్యాలతో నిర్మించారు.
ఇవీ చూడండి: సైలెంట్‌గా దూసుకెళ్లే సూపర్సోనిక్ విమానాలు