పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఊహించినట్లుగానే పార్టీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. అయితే భాజపాలో చేరట్లేదని, కాంగ్రెస్‌ను మాత్రం కచ్చితంగా వీడతానని స్పష్టం చేశారు.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాల కారణంగా.. సెప్టెంబర్ 18న అమరీందర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత.. చరణ్‌జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇది జరిగిన కొన్నిరోజులకే పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు సిద్ధూ. ఈ నేపథ్యంలోనే.. పార్టీలో ఉండనని కెప్టెన్ చెప్పారు.
అది మంచిది కాదు..
తాను భాజపాలో చేరనని, అయితే కాంగ్రెస్‌లో కొనసాగే ఉద్దేశం కూడా లేదని గురువారం స్పష్టం చేశారు అమరీందర్ సింగ్. తనకు తీవ్ర అవమానం జరిగిందని, తనపై కాంగ్రెస్ విశ్వాసం ఉంచలేదని ఆరోపించారు. పంజాబ్ ప్రయోజనాల దృష్ట్యా ఏం చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో ఇంకా ఆలోచిస్తున్నట్లు స్పష్టం చేశారు.
''కాంగ్రెస్‌లో నాకు అవమానం ఎదురైంది. నేను దీనిని తీసుకోలేను. నా సిద్ధాంతాలు, సూత్రాలకు విరుద్దంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేను ఇక కొనసాగలేను.''
- అమరీందర్ సింగ్, మాజీ సీఎం
కాంగ్రెస్.. సీనియర్లను పక్కనపెడుతోందని, ఇది పార్టీకి ఏ మాత్రం మంచిదికాదని అన్నారు అమరీందర్. అందుకే రోజురోజుకూ దిగజారుతోందని విమర్శించారు. సీనియర్ నేత కపిల్ సిబల్ ఇంటిపైనా.. కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. సిబల్ అభిప్రాయం.. అధిష్ఠానానికి రుచించలేదని తెలిపారు.
వరుస భేటీల తర్వాత..
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత.. భాజపాలో చేరతారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన దిల్లీ పర్యటన చేపట్టటం అందుకు బలం చేకూర్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బుధవారం భేటీ అయ్యారు అమరీందర్. అయితే.. రైతుల సమస్య సహా రాష్ట్రంలో భద్రతా పరిస్థితులపై ఆందోళన గురించి మాట్లాడినట్లు పేర్కొన్నారు.
గురువారం జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్‌తోనూ భేటీ అయ్యారు. ప్రస్తుత ప్రభుత్వంతో.. పంజాబ్‌లో పాక్ సమస్యలు సృష్టించే అవకాశముందని, దానిపైనే చర్చించినట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ విఫలయత్నం..
భాజాపా నేతలతో వరుస భేటీ నేపథ్యంలో కెప్టెన్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం విశ్వప్రయత్నాలు చేసింది. భాజపాలో చేరకుండా.. ఉండేలా అమరీందర్‌ను శాంతిపజేసేందుకు సీనియర్ నేతలు అంబికా సోని, కమల్‌నాథ్‌లకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. అయితే ఇవేమీ ఫలించలేదు. కాంగ్రెస్ నుంచి తప్పుకోనున్నట్లు స్పష్టం చేశారు అమరీందర్.