కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న నాటకీయతకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగనుంది. ముఖ్యమంత్రి పదవి నుంచి బీఎస్ యడియూరప్ప తప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని సోమవారం యడ్డీ స్వయంగా ప్రకటించారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన రోజే యడియూరప్ప రాజీనామా చేస్తుండటం గమనార్హం. సాయంత్రం 4 గంటలకు ఆయన గవర్నర్‌కు కలిసి రాజీనామా పత్రాన్ని(Yediyurappa Resignation) సమర్పించనున్నారు.
కర్ణాటక ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యడియూరప్ప మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నా రాజకీయ జీవితంలో ప్రతిక్షణం అగ్నిపరీక్షే. కొవిడ్ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. అయినా రెండేళ్ల పాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా ముందుకు నడిపా. ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మాజీ ప్రధాని వాజ్‌పేయీ కేంద్రంలో మంత్రిపదవి ఇస్తానని చెప్పారు. కానీ నేను కర్ణాటకలోనే ఉంటానని ఆయనకు చెప్పా. ఈ ప్రజలకు నేను ఎంతగానో రుణపడి ఉన్నా’’ అని యడ్డీ కన్నీళ్లుపెట్టుకున్నారు.