కల్కి అవతారం(విష్ణుమూర్తి పదో అవతారం)గా చెప్పుకొంటున్న గుజరాత్‌కు చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి రమేశ్ చంద్ర ఫెఫార్.. వివాదస్పద లేఖతో వార్తల్లో నిలిచాడు. ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన గ్రాట్యూటీని వెంటనే విడుదల చేయకపోతే తనకున్న అతీత శక్తులతో కరవును సృష్టిస్తానని హెచ్చరించాడు.
"ప్రభుత్వంలో రాక్షసులు కూర్చొని నాకు రావాల్సిన సంవత్సరం జీతం రూ. 16 లక్షలు, మరో 16 లక్షల గ్రాట్యూటీని అడ్డుకుంటున్నారు. ఆ డబ్బును వెంటనే విడుదల చేయకపోతే.. ప్రపంచంలో కరవును సృష్టిస్తా" అని ఫెఫార్ లేఖలో పేర్కొన్నాడు.
తన కారణంగానే దేశంలో మెరుగైన వర్షపాతం నమోదైందని.. కేంద్రానికి రూ. 20 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందన్నాడు.
షోకాజ్ నోటీసులు..
అయితే ఫెఫార్.. ఆఫీస్‌కు రాకుండా జీతం అడగటం ఏంటని నీటి వనరుల శాఖ సెక్రటరీ ఎంకే జాదవ్ ప్రశ్నించారు. ఆయన కల్కి అవతారం కాబట్టి జీతం ఇవ్వాలని నిర్ణయించుకోవటంలో అర్థం లేదన్నారు.
రమేశ్చంద్ర ఫెఫార్ గతంలో వడోదరలోని నీటి వనరుల శాఖలో ఇంజనీర్‌గా పనిచేశాడు. గతంలో ఫెఫార్ చాలా కాలం పాటు కార్యాలయానికి హాజరుకాని క్రమంలో ప్రభుత్వం ఆయనకు ముందస్తు పదవీ విరమణ ఇచ్చింది. 8 నెలల్లో 16 రోజులు మాత్రమే ఆఫీస్‌కు వచ్చిన నేపథ్యంలో ఆయనకు షోకాజ్ నోటీసులు అందించింది.
ఇదీ చదవండి: రూ. 0 నోటు వెనకున్న కథ తెలుసా?