Hyderabad Traffic in Rain : పైనుంచి కుండపోత వర్షం.. కింద మోకాళ్ల లోతు నీళ్లు.. వాహనం అడుగు కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ రహదారులపై గత వారం రోజులుగా ఇదే పరిస్థితి. హయత్ నగర్ నుంచి మొదలు మియాపూర్ వరకు, అత్తాపూర్ నుంచి సికింద్రాబాద్, ఉప్పల్ వరకు ఎక్కడ చూసినా ప్రధాన రహదారులపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగర వాసికి ట్రాఫిక్ కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడుప్పల్ వరకు చేరాలంటే వాహనదారులకు మంగళవారం రాత్రి గంటన్నర సమయం పట్టిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం అవుతుంది.
Hyderabad Rains : భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని అనేక ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతుండగా, ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లివచ్చే ఉదయం, సాయంత్రం సమయాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. రహదారులపై నీటి వల్ల వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడం, ఇంజిన్‌లలోకి నీరు చేరి ఆగిపోవడం, వాన నుంచి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనదారులు మెట్రో పైవంతెనల కింద ఆగడం, చెట్లు విరిగిపడడం, ఎక్కడికక్కడ గుంతల వల్ల గత వారం రోజులుగా కిలోమీటర్ల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహన శ్రేణులను నియంత్రిస్తున్నా, నీరు నిలవకుండా బల్దియా సిబ్బంది డ్రైనేజీలను సరిచేస్తున్నా ఈ చర్యలు ఏమాత్రం సరిపోవడం లేదు. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులపై వర్షం వస్తే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లే కనిపిస్తున్నాయి.
Hyderabad Traffic Jam : లక్ష నుంచి లక్షన్నర మంది ఉద్యోగులు పని చేసే హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో వర్షాల్లో ట్రాఫిక్ కష్టాలు చెప్పనలవిగానట్లు ఉన్నాయి. గచ్చిబౌలి, ఐకియా సర్కిల్, ఏఐజీ ఆస్పత్రి, హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం, నానక్ రామ్ గూడ, విప్రో సర్కిల్, కొండాపూర్ రహదారులన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. సోమవారం రాత్రి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర స్వయంగా రహదారులపైకి వచ్చి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఐటీ ఉద్యోగులు ఇంటికి వెళ్లేందుకు 3విడతల్లో లాగౌట్ సమయాలను అమలులోకి తెచ్చారు.
రోడ్లు దెబ్బతినడానికి కారణం ఏమిటి.. : చిన్న వాన వస్తేనే హైదరాబాద్ రహదారులపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకైతే పరిస్థితి అందరూ చూస్తున్నదే. దీనికి కారణాలు ఏమిటని పరిశీలిస్తే అవి లెక్కకు మిక్కిలి ఉన్నాయి. నాలాల నిర్వహణ సరిగా లేకపోవడం, చిన్న వాన వస్తే రోడ్లు దెబ్బతిని గుంతలు ఏర్పడడం, వాటిని పూడ్చడంలో జాప్యం వంటివి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అమీర్‌పేట మైత్రీవనం కూడలిలో నాలా పక్కనే ఉన్నా మోకాళ్ల లోతు నీరు నిలుస్తోంది. వర్షాలకు మూసీనది పొంగి ప్రవహిస్తూ ఉంటే అత్తాపూర్, చాదర్‌ఘాట్, మూసారాం బాగ్ వంతెనలు నీట మునుగుతున్నాయి. దీంతో సరైన సన్నద్ధత లేక ఇంజినీర్లు, వర్షాకాల అత్యవసర సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Hyderabad Rains : రెడ్ జోన్లో హైదరాబాద్.. ఇవాళ అతిభారీ వర్షాలు
సాకులు చెబుతున్న ఇంజినీర్లు : హైదరాబాద్‌లో వేల కోట్ల రూపాయలతో రహదారులు, పై వంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నా ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరడం లేదు. 30వేల కోట్ల రూపాయలతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం.. ఎస్ఆర్డీపీ కింద బల్దియా నగరవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి పూనుకుంది. అయితే వీటి నిర్మాణంలో ఇంజినీర్లు సరైన ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఆర్డీపీ కింద మొదట అయ్యప్ప సొసైటీ కూడలిలో అండర్‌పాస్ నిర్మించారు. కాని వర్షం వస్తే చాలు అందులో నీరు చేరుతోంది. ఇదేమిటని అడిగితే ఇంజినీర్లు సాకులు చెబుతున్నారు. లింగంపల్లి రైల్వేస్టేషన్, కేపీహెచ్‌బీ రైల్వేస్టేషన్‌ల వద్ద ఉన్న ఆర్యూబీల చెంత కూడా వర్షం వచ్చి నీరు చేరితే ప్రమాదకర పరిస్థితి నెలకొంటోంది.
నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరేదెప్పుడు.. : రాజధానిలో రహదారుల పొడవు, వెడల్పునకు తగ్గట్లుగా వరద నీటి వ్యవస్థ అభివృద్ధి కాలేదు. రోడ్ల నిర్మాణంలో శాస్త్రీయత లేదు. 2018లోనే నగర వ్యాప్తంగా రోడ్ల స్థితిపై సర్వే చేసి ఈ అంశాలతో బల్దియాకు నివేదిక ఇచ్చినట్లు జేఎన్టీయూ నిపుణులు చెబుతున్నారు. కురిసిన వర్షం అంతా వేగంగా నాలాల్లోకి చేరడం, అక్కడి నుంచి మూసీకి పరుగులు తీసేందుకు రోడ్ల నిర్మాణాన్ని చేపట్టేలా సూచించినట్లు తెలిపారు. దీని అమలుకు రూ.4వేల కోట్లు నుంచి రూ.5వేల కోట్లు అవసరం అని, తద్వారా గుంతల పూడ్చివేత, రోడ్ల నిర్వహణకు ఏటా వందల కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. అయితే తమ సూచనలను బల్దియా పట్టించుకోలేదని జేఎన్టీయూ నిపుణులు తెలిపారు. అందుకే ఈ పరిస్థితి అని అంటున్నారు. భారీ వర్షాలు ప్రకృతిపరమైన అంశమే అయినా.. నగరంలో ట్రాఫిక్ కష్టాలు కొంతైనా తీరాలంటే రహదారుల నిర్వహణకు బల్దియా నిరంతర పర్యవేక్షణ సహా, నిపుణుల సూచనలు పాటిస్తే మేలు అనే వాదన వినిపిస్తోంది.
ఇవీ చదవండి :