దేశ రాజధాని దిల్లీలో ప్రియుడి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్ ఘటన మరవకముందే ఝార్ఖండ్ సాహిబ్హంజ్లో అలాంటి ఘోరమే జరిగింది. ఓ వ్యక్తి తన రెండో భార్యను పాశవికంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని అనేక ముక్కలుగా నరికేసి.. బయట పడేశాడు. మృతురాలిని రూబికా పహారియాగా(22) పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతురాలు రూబికా గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్వ్కాడ్‌తో గాలింపు చర్యలు చేపట్టగా.. రూబికా శరీరంలోని 18 భాగాలు పోలీసులకు లభించాయి. మిగతా శరీరభాగాల కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దిల్దార్ అన్సారీ, అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడికి అంతకుముందే వివాహం జరిగింది. రూబికాను రహస్యంగా రెండో వివాహం చేసుకుని వేరే ఇంట్లో కాపురం పెట్టాడు.
అమెరికా వెళ్తున్నానన్న ఆనందంలో..
పంజాబ్ సంగ్రూర్‌లో ఘోరం జరిగింది. పాటియన్వాలి గ్రామానికి చెందిన రంజోద్ సింగ్(20) అనే యువకుడు.. అమెరికా వెళ్లబోతున్నానన్న ఆనందంలో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. అయితే ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మరణించాడు.