Army Jawan suicide: బిహార్‌కు చెందిన ఓ జవాను తన భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్ మధ్యలోనే తనను తాను కాల్చుకున్నాడు. భర్త ఆత్మహత్య చేసుకోవడాన్ని చూసి భరించలేని భార్య.. తనువు చాలించాలని నిర్ణయించుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్రమైన కాలిన గాయాలతో ప్రస్తుతం పట్నాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటన గురించి తెలియగానే జవాను సోదరుడికి గుండెపోటు వచ్చింది. ఈ ఘటనలతో భోజ్పుర్లోని జవాను స్వస్థలమైన పైనియా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Secunderabad Jawan Suicide: జవాను మహేశ్ సింగ్(40) బిహార్ రెజిమెంట్‌లో నాయక్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఆర్మీ క్యాంపస్‌లో ఉంటున్నారు. ఇక్కడే తనను తాను కాల్చుకొని చనిపోయాడు. చాలా రోజుల నుంచి ఆయన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం తన భార్యతో మాట్లాడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీడియో కాల్లో భార్య అతడిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ.. మహేశ్ వినలేదు. భర్త మరణాన్ని లైవ్‌లో చూసిన భార్య గుడియా.. తీవ్రంగా కలత చెందింది. వెంటనే తన ఒంటిపై కిరోసిన్ పోసుకుంది.
ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఆమెను గమనించే సరికి.. 85 శాతానికి పైగా శరీరం కాలిపోయింది. హుటాహుటిన ఆమెను అరా సర్దార్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు.. పట్నాకు తీసుకెళ్లాలని సూచించారు. గుండెపోటుకు గురైన మహేశ్ సోదరుడు జయంత్ సింగ్ సైతం పట్నా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహేశ్ సింగ్‌కు ఐదుగురు సోదరులు ఉన్నారు. అందరికన్నా మహేశే చిన్నవాడు. గ్రామంలో తన తల్లితో కలిసి వేరుగా ఉండేవాడు. 2003లో ఆర్మీలో చేరిన మహేశ్... గల్వాన్ లోయలోనూ సేవలందించాడు. ఆరు నెలల క్రితం సికింద్రాబాద్‌కు మారాడు. అతడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మహేశ్ మృతదేహం మంగళవారం ఆయన స్వస్థలానికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి కన్నతల్లి హత్య.. కారణం తెలిస్తే షాక్!