Punjab Assembly Election 2022: అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల మోదీ పర్యటనల సందర్భంగా జరిగిన ఆసక్తి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత హీట్‌ను పెంచాయి.
పంజాబ్‌లో గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి చతుర్మఖ పోటీ నెలకొంది. 2017వరకు సంప్రదాయ పార్టీలలైన కాంగ్రెస్- శిరోమణి మధ్యే పోటీ ఉండేది. మిగతా పార్టీలు తమ వ్యూహాలకు అనుగుణంగా ఈ రెండు పార్టీల్లో ఒక కూటమిలో చేరి పోటీ చేసేవారు.
అయితే ఈసారి రాజకీయ సమీకరణాలు మారాయి. రైతు ఉద్యమం కారణంగా చిరకాల నేస్తాలైన శిరోమణి- భాజపా వేరుపడ్డాయి. కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకొని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సొంత పార్టీ పెట్టుకున్నారు. దీంతో సంప్రదాయ పార్టీలైన శిరోమణి అకాలీదళ్.. బీఎస్పీతో కలిసి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఫలితంగా రాష్ట్రంలో ఈ సారి చతుర్మఖ పోటీ నెలకొంది.
మిత్రపక్షాలతో కలిసి గెలిచి తీరాలని ఊవిళ్లూరుతోంది భాజపా. మరోవైపు తమకు అత్యంత కీలకమైన పంజాబ్‌లో మళ్లీ పాగా వేయాలని తహతహలాడుతోంది అధికార కాంగ్రెస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకొని ప్రధాన పార్టీలకు షాకిచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈసారి సీఎం పీటంపై కన్నేసింది. రాష్ట్రంలో బలమైన కేడర్ ఉన్న శిరోమణి అకాలీదళ్ సైతం గెలుపు కోసం శక్తిమేరకు కృషి చేస్తోంది.
తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో మార్చి 10న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? 117 స్థానాలున్న పంజాబ్‌లో ఏ పార్టీ మేజిక్ ఫిగర్‌ను చేరుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒకసారి పార్టీల స్థితిగతులను పరిశీలిద్దాం.
ఈ గెలుపు కాంగ్రెస్‌కు కీలకం..
పంజాబ్‌లో గెలవడం చాలా కీలకం. వరుస ఓటముల నేపథ్యంలో ఇక్కడ గెలుపు.. కాంగ్రెస్‌కు ఎంతో ఊరటనిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా వ్యవహరించి.. కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను సీఎంగా తొలగించింది హస్తం పార్టీ. ఆయన స్థానంలో దళిత సిక్కు అయిన చరణ్‌జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించింది. ఇలా చేయడం వల్ల మెజార్టీ శాతం దళితుల ఓటర్లు తమవైపు వస్తారని ఆశపడుతోంది.
అక్రమ మైనింగ్ వ్యవహారం విషయంలో కాంగ్రెస్ నాయకులు, మంత్రులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశం ఎన్నికల్లో పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ 59 స్థానాలను గెలుస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2017లో కాంగ్రెస్ పార్టీ 79 సీట్లు గెలుచుకుంది. ఈ క్రమంలో ఎన్నికలకు నాలుగు నెలల ముందు.. రాష్ట్రంలోనే మొదటిసారిగా దళితుడిని సీఎం చేసింది కాంగ్రెస్. ఈ ఫ్యాక్టర్ కలిసొచ్చి.. సీట్లు తగ్గినా.. 59 సీట్లను గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని భావిస్తోంది హస్తం పార్టీ. అలాగే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మరో పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.
ఆశల పల్లకిలో అకాలీదళ్-బీఎస్పీ..
రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా.. అధికారంలో కోసం పోటీ పడేవి మాత్రం రెండు పక్షాలే. అవి కాంగ్రెస్- శిరోమణి అకాలీదళ్. అకాలీదళ్ ఈ ఎన్నికల్లో తొలిసారి బహుజన సమాజ్ పార్టీతో కలిసి కూటమిగా పోటీ చేస్తోంది. రైతు ఉద్యమం నేపథ్యంలో తన చిరకాల మిత్ర పక్షం భాజపాకు దూరమైంది శిరోమణి. సాగు చట్టాల ప్రభావం.. శిరోమణి అకాలీదళ్‌పై తీవ్రంగా పడింది. పార్టీపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. అయితే సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మళ్లీ రంగంలోకి దిగగా.. అకాలీదళ్ గతసారి కంటే ఈసారి బలంగానే ఉంది. అయితే అధికారంలోకి రావడం మాత్రం కష్టంగానే కనిపిస్తోంది.
మరోసారి ఆప్ ప్రభంజనం?
ఆమ్ ఆద్మీ పార్టీ 2017లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ ఎన్నికల్లో ఆప్ అనూహ్యంగా 20 సీట్లు గెలుచుకొని.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా.. ఆప్ అధినేత కేజ్రీవాల్ మాత్రం ఆశలు వదులుకోలేదు. భగవంత్ మాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి.. ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఆప్‌కు మాల్వా ప్రాంతంలో గట్టి పట్టుంది. మాల్వాలోని 69 స్థానాల్లో మెజార్టీ స్థానాలు గెలవకుండా పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యం. దోబా, మజా ప్రాంతాల్లో కూడా సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది. అయితే ఆప్ మాల్వాలో ప్రభావం చూపినా.. మజా, దోబా ప్రాంతాల్లో మాత్రం అది అసాధ్యం. ఈ చోట్ల అకాలీదళ్, బీజేపీ బలంగా ఉన్నాయి. మాల్వాలోనే దాదాపు అరడజను చోట్ల చతుర్ముఖ పోటీ నెలకొంది. ఇతర పక్షాలు కూడా ఈ పార్టీతో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకునే అవకాశాలు అయితే కనిపించట్లేదనే చెప్పాలి.
అమరీందర్ నేతృత్వంలో కూటమి..
భాజపా ఈసారి కొత్త కూటమితో బరిలోకి దిగుతోంది. పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధినేత అమరీందర్ సింగ్ కూటమికి పెద్ద ముఖంగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో కంటే.. ఈసారి భాజపా దుకుడుగా వ్యవహరిస్తోంది. పట్టణాల్లో బలపడుతోంది. ఈ నేపథ్యంలో కూటమి విజయంపై ధీమాగా ఉంది. అయితే కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన అమరీందర్ సింగ్.. తన పార్టీని ఎన్ని స్థానాల్లో గెలిపిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమరీందర్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనే దానికంటే.. ఎన్ని చోట్ల హస్తం పార్టీ ఓట్లను చీల్చుతుంది అనేది ఇక్కడ కీలకం కానుంది.
అకాలీదళ్ సంయుక్త్ పార్టీ పెద్దగా బలం పుంజుకోలేక పోయినా.. చాలా స్థానాల్లో సిక్కుల ఓటు బ్యాంకును కూడగట్టుకునే అవకాశం ఉంది. అయితే ఈ కూటమి నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు నిపుణులు అంటున్నారు.
ఎన్నికల తర్వాత 'శిరోమణి'కి మద్దతు?
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 59స్థానాలు ఏ పార్టీకీ రాకపోతే.. ఎన్నికల తర్వాత శిరోమణి అకాలీదళ్‌కు కాంగ్రెస్, ఆప్ మినహా ఇతర పార్టీలు మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత ముఖ్యంగా భాజపాతో శిరోమణి అకాలీదళ్ పార్టీ పొత్తు పెట్టుకునే సూచనలు పుష్కలంగానే ఉన్నాయి.
రైతు ఉద్యమం నేపథ్యంలో భాజపాతో ఉంటే.. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పడిపోతుందనే ఉద్దేశంతో శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చింది. అలాగే.. హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తన కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే ఇదంతా భాజపా గేమ్‌ప్లాన్‌లో భాగమనేనని ప్రతిపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. భాజపాకు బాదల్ కుటుంబానికి ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది. అకాలీదళ్ పార్టీ భాజపాకు దూరమైనా.. వారి మధ్య అనుబంధం ఇప్పటికీ బలంగా ఉంది. ప్రకాశ్ సింగ్ బాదల్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలపడం.. ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
సిక్కుల మత గురువు గురు గోవింద్ సింగ్ గౌరవార్థం ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తేదీని వీర బాలల దినోత్సవంగా జరుకోవాలని మోదీ తాజాగా ప్రకటించారు. దేశం మొత్తం గురు గోవింద్ సింగ్ కుమారులను స్మరించుకోవాలని సూచించారు. ఈ ప్రకటన అనంతరం సిక్కు మత పెద్దలు మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ఇలాంటి పరిణామాలు ఎన్నికల తర్వాత శిరోమణి అకాలీదళ్‌తో భాజపా పొత్తుకు ఉపకరిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.