How To Clean Dishes Easily Home Made : ఇంట్లో మనం రెగ్యూలర్‌గా వంట పూర్తైన తరవాతనో లేదా అందరూ అన్నం తిన్న తరవాత గిన్నెలను శుభ్రం చేస్తుంటాం. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల డిష్‌వాష్ సోప్స్, లిక్విడ్‌లను వాడుతుంటాం. ఇవి చాలా ఖరీదుగా ఉంటాయి. ఒక్కొసారి ఈ సోప్స్ లేని సమయంలో వంటింట్లోని పదార్థాలతో గిన్నెలను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సబ్బులు, లిక్విడ్స్ లేకుండా ఈజీగా గిన్నెలను ఎలా శుభ్రం చేసుకోవాలో, ఈ కథనంలో తెలుసుకుందాం.
నిమ్మ, బేకింగ్ సోడా..
నిమ్మ, బేకింగ్ సోడా మిశ్రమం గిన్నెలని చాలా బాగా క్లీన్ చేస్తుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి ముందుగా ఓ గిన్నెలో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను తీసుకోండి. తరవాత ఇందులోకి ఒక నిమ్మకాయను పిండండి. మిశ్రమాన్ని బాగా కలిపితే, అది నురుగులాగా ఫామ్ అవుతుంది. జిడ్డుగా ఉన్న పాత్రలను ఈ మిశ్రమం సహాయంతో ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు.
వెనిగర్..
ఒక స్ప్రే బాటిల్‌ను తీసుకుని అందులోకి గోరువెచ్చని నీటిని పోసుకోండి. బాటిల్‌లోకి అర టీ స్పూన్ వెనిగర్‌ను కలపండి. వెనిగర్ నీటిలో పూర్తిగా కరిగిన తరవాత, ఆ నీటిని గిన్నెలపై స్ప్రే చేసి కాసేపటి తర్వాత రుద్ది క్లీన్ చేయండి.
ఆర్టిఫిషియల్ ఆభరణాలతో స్కిన్ అలర్జీ వస్తోందా? - ఇలా చెక్ పెట్టండి!
బియ్యం గంజి..
బియ్యంలో స్టార్చ్, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. దీని వల్ల పాత్రలకు అంటుకున్న జిడ్డు, దుర్వాసన తొలగిపోతాయి. గొరువెచ్చగా ఉన్న బియ్యం గంజిని గిన్నెలపై పోసి, కొద్ది సేపటి తరవాత స్క్రబ్బర్‌తో స్క్రబ్ చేసి క్లీన్ చేయండి.
బూడిద..
ఎక్కువగా బూడిదను సబ్బులు, లిక్విడ్స్ రాకముందు ఉపయోగించేవారు. ఎప్పుడైతే ఇవి వచ్చాయో అందరూ బూడిదతో గిన్నెలను తోమడం మర్చిపోయారు. బూడిదతో గిన్నెలను ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. చాలా మంది స్కబర్ కంటే కొబ్బరి పీచుతో బూడిదను ఉపయోగించి గిన్నెలను శుభ్రం చేసుకోవచ్చని చెబుతారు.
ఉప్పు, నిమ్మరసం..
ఉప్పు, నిమ్మరసం కలిపిన మిశ్రమం పాత్రల్లోని జిడ్డును, దుర్వాసనను తొలగిస్తుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకోవాలి. ఈ నీటిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు, నిమ్మరసాన్ని కలపాలి. ఈ నీటిని పాత్రలపై చల్లి కాసేపటి తరవాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
బేకింగ్ సోడా..
బేకింగ్ సోడాను చాలా వంటల్లో ఉపయోగిస్తుంటాం. దీన్ని ఉపయోగించి మనం గిన్నెలు కూడా కడగొచ్చు. ఏదైనా పాత్రలు చాలా జిడ్డూగా ఉన్నాయని అనిపిస్తే ఈ టిప్ ఫాలో అవండి. ముందుగా జిడ్డు పాత్రను కాసేపు వేడి నీటిలో ఉంచండి. ఆ తరవాత ఆ పాత్రను బయటికి తీసి కొద్దిగా బేకింగ్ సోడాను గిన్నెపై చల్లండి. తరవాత స్క్రబర్ సహాయంతో బాగా రుద్దితో సరిపోతుంది. గిన్నె మెరిసిపోతుంది అంతే.