హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు పోటెత్తాయి. వరదలు, కొండ చరియలు విరిగిపడిన కారణంగా ఆరుగురు మరణించారని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు. మరో పది మంది గాయపడగా.. 303 పశువులు మృతి చెందాయని వెల్లడించారు. వరదలు, కొండ చరియలు విరిగిపడటం వల్ల 124 రహదారులు దెబ్బతిన్నాయని.. అందులో రెండు జాతీయ రహదారులు ఉన్నట్లు చెప్పారు. ఈ వరదల వల్ల సుమారు రూ.3 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. పర్యటకులు.. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ జారీ చేస్తున్న మార్గదర్శకాలను పాటించాలని కోరారు.
మరోవైపు భారీ వర్షాలకు తోడు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల మండీ-కుల్లు, మనాలి-చండీగఢ్ జాతీయ రహదారులపై రాకపోకలు స్తంభించిపోయాయి. దాదాపు 200 మందికి పైగా పర్యటకులు చిక్కుకుపోయి ఆదివారం సాయంత్రం నుంచి రోడ్డుపైనే నరకయాతన పడుతున్నారు. రోడ్డుకు అడ్డంగా పడిన బండరాళ్లను పేల్చేందుకు పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఏడెనిమిది గంటల తర్వాతే వాహనాలు ముందుకు కదిలేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
చండీగఢ్-మనాలీ జాతీయ రహదారిపై 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అనారోగ్యంతో ఉన్న వారిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలిస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. వేరే మార్గాల ద్వారా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నా.. రోడ్లు చిన్నవి కావడం వల్ల మళ్లీ వాహనాల రద్దీ పెరుగుతోందని పేర్కొన్నారు. ట్రాఫిక్ క్లియర్ అయ్యేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొనడం వల్ల పర్యటకులు, అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా మహిళలు, చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారుతోందని ఆవేదన వెలిబుచ్చుతున్నారు.
వచ్చే రెండు రోజులు వర్షాలే
హిమాచల్ ప్రదేశ్‌లో వచ్చే రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ స్థానిక వాతావరణ శాఖ కార్యాలయం హెచ్చరికలు జారీచేసింది. మండీ జిల్లాలో ఒక్క రోజులోనే అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారి సురేంద్ర పాల్ తెలిపారు. మరో 4-5 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు.
పిడుగులు పడి నలుగురు మృతి
రాజస్థాన్‌లో పిడుగులు పడి ఒకే రోజు నలుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఆదివారం కురిసిన వర్షాలకు పిడుగు పడి పాలి, బారా, బికానేర్, ఛిత్తోఢ్గఢ్ జిల్లాలోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిని దినేశ్ (21), హరిరామ్(46), కమల్ (32), పదేళ్ల బాలికగా గుర్తించారు.
ఇవీ చదవండి : భారీ వర్షాలు.. సరస్సులో 26 మంది టూరిస్ట్‌లు.. టెన్షన్ టెన్షన్!
భారీ వర్షాలు.. వరదల బీభత్సం.. 5లక్షల మంది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు!