Chandrababu Quash Petition Dismissed: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఈ దశలో క్వాష్ పిటీషన్ విచారణ అనుమతించలేమని తెలిపింది. సీఐడీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తెలిపింది. నిహారిక ఇన్ ఫ్రాస్ర్టక్చర్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని పేర్కొంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనను అరెస్ట్ చేసి, ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ సస్పెండ్ చేయాలని.. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
CID on CBN Skill Development Case: ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు..! అంతా సీఐడీ మార్కు కనికట్టు
సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని కొట్టివేసింది. 482 సీఆర్పీసీ ప్రకారం క్వాష్ పిటీషన్ లో సుప్రీంకోర్టు కీలకమైన జడ్జిమెంట్లు ఇచ్చింది. నిహారిక ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో కొన్ని సూచనలు చేసిందని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. సీఐడీ అధికారులు 4వేల కాపీలు అందజేశారని.. 140 మంది సాక్షులను ఇప్పటికే ఈకేసులో విచారించినట్లు తెలిపారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు దశలో ఉందని.. పోలీసుల దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని తెలిపారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని క్వాష్ పిటీషన్ను డిస్ మిస్ చేశారు. ఈనెల 12 వతేదీన క్వాష్ పిటీషన్ను లంచ్ మోషన్ గా స్వీకరించాలని కోరగా.. 13న వింటామని కోర్టు తెలిపింది. 13 పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 19 కి వాయిదా వేసింది. 19 వతేదీన హైకోర్టు పూర్తి స్థాయి విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ చేసింది.
Chandrababu to CID custody : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ కస్టడీకి చంద్రబాబు
క్వాష్ పిటీషన్ పై చంద్రబాబు తరఫు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ నిబంధనలను అనుసరించి గవర్నర్ అనుమతి తీసుకోకుండా టీడీపీ అధినేత చంద్రబాబు పై కేసు నమోదు చేయటం, దర్యాప్తు చేయటం, అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపటం చెల్లవని వాదించారు. రాజకీయ ప్రతీకారంతో పిటీషనర్ పై కేసు నమోదు చేశారన్నారు. నిధులు దుర్వినియోగం అయ్యాయనేందుకు ఆధారాలు లేవన్నారు. చట్ట సవరణ చేసిన తర్వాత నమోదు చేసిన కేసుల్లో 17ఏ వర్తిస్తుందన్నారు. ఓ ప్రభుత్వ హయాంలో పబ్లిక్ సర్వెంట్లు తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మరో ప్రభుత్వం వారిపై కక్షసాధింపులకు పాల్పడకుండా ఉండేందుకు ఇది రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసి వ్యక్తిగత స్వేచ్ఛను హరించటానికి వీల్లేదని అర్నాబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు తెలిపిందన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత నిధుల మళ్లింపు ప్రస్తావన ఉండదన్నారు. పిటీషనర్ విదేశాలకు వెళ్లిపోయే వ్యక్తి కాదని, ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు కేసులో ఇరికించారన్నారు. ప్రాజెక్ట్ ను కేంద్రప్రభుత్వ సంస్థ మదింపు చేసిందని వివరిస్తూ.. స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల నుంచి 2.13 లక్షల మంది శిక్షణ తీసుకున్నారని తెలిపారు. ఈకేసును 2021 డిసెంబర్ నుంచి దర్యాప్తు చేస్తున్నారని.. ఈ దశలో సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. దర్యాప్తుకు పిటీషనర్ సహకరిస్తారని స్పష్టం చేస్తూ.. పిటీషనర్ ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని.. ఈ కస్టడీని కొనసాగించాల్సిన అవసరం లేదన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పిటీషనర్ కు ఉపశమనం కలిగేలా ఆదేశాలివ్వాలని కోరారు.
సీఐడి తరపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. పిటీషనర్ ఇటీవలే పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారన్నారు. ఈ దశలో దర్యాప్తు నిలువరించేలా ఆదేశాలివ్వొద్దన్నారు. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17ఏ ను పాటించాల్సిన అవసరం లేదన్నారు. సవరణ సెక్షన్ అమల్లోకి రాక పూర్వం నేర ఘటన జరిగిందనందును ఈకేసుకు సెక్షన్ వర్తించదన్నారు. ప్రస్తుత కేసులో సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు వాటా సొమ్మును ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేసిందన్నారు. ఆ సొమ్మును షెల్ కంపెనీలు డ్రా చేసుకున్నాయన్నారు. 2018 తర్వాత ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫైళ్లు కనపడకుండా పోయాయని, వాటిని అధికారులు పునరిద్ధరించే పనిలో ఉన్నారని తెలిపారు. ప్రాజెక్ట్ నిధుల విడుదల విషయంలో ఆర్థిక శాఖ లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండా సొమ్ము విడుదల చేశారన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని పిటీషన్ను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం క్వాష్ పిటీషన్ కొట్టేస్తూ తీర్పునిచ్చింది.