High Court Adjourns Margadarsi Quash Petition on December 6: మార్గదర్శి సంస్థ ఛైర్మన్, ఎండీ లపై... సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో తదనంతర చర్యలన్నీంటిపై హైకోర్టు స్టే ఇచ్చింది. క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ వేయాలని సీఐడీని ఆదేశిస్తూ... విచారణను డిసెంబర్ 6కు వాయిదా వేసినట్లు పేర్కొంది. విచారణ సందర్భంగా.. వివిధ అంశాలపై సీఐడీని హైకోర్టు ప్రశ్నించింది. పరిధిలో లేకున్నా కేసు ఎందుకు నమోదు చేశారని.. ఈ కేసుకి, చిట్ ఫండ్ కేసుకు సంబంధం ఏమిటని ధర్మాసనం నిలదీసింది. షేర్ల బదలాయింపు హైదరాబాద్ లో జరిగితే ఇక్కడ కేసు ఎలా నమోదు చేశారని ప్రశ్నించింది.
ఆరేళ్ల క్రితం జరిగితే ఇప్పుడు ఫిర్యాదు ఇచ్చారని.. నిబంధనలు అనుసరించే షేర్లు బదలాయింపు జరిగిందని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ రోజు ఆర్డర్ ఇస్తానని కోర్టు తెలిపింది. ఆర్డర్ వద్దని.. కౌంటర్ దాఖలు చేస్తామని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి తెలిపారు. కౌంటరు దాఖలు చేయాలని ప్రతివాదులు యూరిరెడ్డి, సీఐడీని ఆదేశించారు. తన తండ్రి జీజే రెడ్డి నుంచి తనకు వచ్చిన 288 షేర్లను ఫోర్జరీ సంతకాలతో మార్గదర్శి ఎండీకి బదలాయించారని ఆరోపిస్తూ... గాదిరెడ్డి యూరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ ఈ నెల 13న కేసు నమోదు చేసింది. మంగళవారం హైకోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది. 18వ తేదీ వరకు మార్గదర్శి ఛైర్మన్, ఎండీలపై కఠిన చర్యలు తీసుకోబోమని సీఐడీ హామీ ఇవ్వడంతో విచారణ ఇవాల్టికి వాయిదా పడింది.