పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి సమీపంలో తీరాన్ని దాటింది. గడచిన కొద్ది గంటలుగా గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ చెన్నైకి దిగువన తీరాన్ని దాటినట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. వాయుగుండం భూభాగంపైకి వచ్చిన అనంతరం క్రమంగా బలహీనపడుతుందని తెలిపింది. చెన్నై సహా పొరుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది.
చెన్నైలో దంచికొట్టిన వాన..
తమిళనాడులోని చెన్నై(chennai floods today), తిరువళ్లూరు, కంజివరం, రాణిపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఈ వాయుగుండం ప్రభావంతో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా చెన్నై సహా పొరుగున ఉన్న చెంగల్‌పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం తదితర జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. రహదారులపై మోకాలు లోతులో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇళ్లు, ఆస్పత్రుల్లోకి వరద నీరు చేరి.. ప్రజలు అవస్థలు పడుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే దాదాపు 91 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
బీచ్ మాయం..
ప్రముఖ మెరీనా బీచ్‌ను కూడా వరద నీరు ముంచెత్తింది. ఇసుక తిన్నెలపై వరద నీరు చేరింది. సందర్శకుల గ్యాలరీలు, దుకాణాలు అన్నీ కూడా వరద నీటిలో చిక్కాయి. కాగా, చెన్నైలోని ఈఎస్ఐ ఆసుపత్రి కూడా జలదిగ్భందంలో చిక్కుకుంది.
1.5లక్షల ఎకరాల పంట నాశనం
వరుణుడి బీభత్సానికి కావేరీ డెల్టా ప్రాంతంలోని జిల్లాల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి(tamil nadu rain news live). ఆ ప్రాంతంలో దాదాపు 1.5లక్షల ఎకరాల పంట నాశనమైనట్టు సమాచారం. తిరువారుర్‌లో 50వేల ఎకరాలు, కుద్దలూరులో 25వేల ఎకరాలు, నాగపట్టినమ్లో 30వేల ఎకరాలు, మయిలదుథూరైలో 20వేల ఎకరాలు, తంజావుర్‌లో 10వేల ఎకరాల పంటలు నీటమునిగినట్టు విపత్తు నిర్వహణ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పంటనష్టం అంచనా వేసేందుకు.. సీనియర్ మంత్రి పెరియస్వామి సారథ్యంలో సీఎం స్టాలిన్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
మరోవైపు.. చెన్నై, తిరువళ్లూరు, కంజివరం, రానిపేట్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెన్నై వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. సీనియర్ మంత్రులు, అధికారులతో తమిళనాడు సీఎం స్టాలిన్.. వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో అత్యవసరమైతే ప్రజలెవరూ కూడా బయటికి రావద్దని సూచించారు.
ఇదీ చదవండి: