Heavy Rush Sabarimala High Court Case : శబరిమలలో నెలకొన్న రద్దీతో భక్తులకు తలెత్తుతున్న ఇబ్బందులపై సుమోటో కేసును స్వీకరించింది కేరళ హైకోర్టు దేవస్థానం బెంచ్. మండలం, మకరజ్యోతి కాలంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎరుమెలిలోని హోటళ్లలో ధరల బోర్డులు పెట్టడమే కాకుండా పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌కు సూచించింది. వీటితో పాటు పంచాయితీ కార్యదర్శికి సైతం పలు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. పార్కింగ్ స్థలాల్లో అధిక డబ్బులు వసూలు చేయకుండా చూసుకోవాలని చెప్పింది. లైసెన్స్‌లు లేకుండా పార్కింగ్ స్థలాలు నిర్వహిస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. భక్తులు పడుతున్న ఇబ్బందులపై ఇప్పటికే రిజిస్ట్రార్‌కు సుమారు 300కు పైగా వచ్చాయని హైకోర్టు దేవస్థానం బెంచ్ తెలిపింది. కోర్టు ఆదేశాల ప్రకారం భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పింది. అయితే, ఈ అంశంపై స్పందించిన ప్రభుత్వం, రద్దీ నిర్వహణలో తలెత్తిన లోపాన్ని భక్తులు ఇబ్బందులుగా చిత్రీకరిస్తున్నారని బదులిచ్చింది.
దర్శనం చేసుకోకుండానే భక్తులు వెనక్కి
నవంబర్ 17న మండలం-మకరజ్యోతి కాలం ప్రారంభం కావడం వల్ల భక్తులు భారీగా పోటెత్తారు. ఫలితంగా రద్దీ నిర్వహణలో లోపం తలెత్తింది. ఆలయానికి వెళ్లే రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఇతర రాష్ట్రాల భక్తులు అయ్యప్ప దర్శనం కాకుండానే పందళం వలియకోయికల్ ధర్మశాస్త్ర ఆలయాన్ని దర్శించుకుని వెనుదిరిగారు. వాహనాలను పంబా వరకు అనుమతించకపోవడం వల్ల ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు వాహనాలను బోలక్కల్ వరకే అనుమతిస్తున్న అధికారులు అక్కడి నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని పంబాకు ప్రభుత్వ బస్సుల్లో వెళ్లాలని సూచించారు.
విజయన్ సర్కార్‌పై విపక్షాల ఫైర్
మరోవైపు శబరిమలకు వచ్చే భక్తులకు అందిస్తున్న ఏర్పాట్లపై కేరళ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. మౌలిక వసతుల లేమిపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుతో అయ్యప్ప దర్శనం కాకుండానే వెనుతిరుగుతున్నామని మండిపడుతున్నారు. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వామపక్ష ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఐతే విపక్షాలు కావాలనే ఈ సమస్యను పెద్దది చేస్తున్నాయని భక్తులు రాక భారీగా పెరగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పినరయి సర్కార్ వివరణ ఇస్తోంది.
శబరిమల భక్తులకు గుడ్‌న్యూస్- అయ్యప్ప స్వామి దర్శన సమయం పెంపు