Heavy rains in Hyderabad : హైదరాబాద్‌లో జోరువర్షం కురిసింది. ఒక్కసారిగా విరుచుకుపడిన వానతో లోతట్టు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. సాయంత్రం 5 గంటల సమయంలో ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం విరుచుకుపడింది. కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్ నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, లకడికపుల్ లలో కురిసిన భారీ వర్షంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం ధాటికి వాహనదారులు, పాదచారులు కొద్దిసేపు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. వర్షం పడినంత సేపు పలువురు ఉద్యోగులు కార్యాలయాలకే పరిమితమయ్యారు.
హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవహించింది. హయత్‌నగర్, భాగ్యలత, పనామా, చింతల్‌కుంట సహా పలు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచింది. యూసుఫ్‌గూడా శ్రీకృష్ణ నగర్ కమ్యూనిటీ హాల్ వీధిలో లోతట్టు ప్రాంతాల్లోకి ప్రవాహం పోటెత్తింది. మలక్‌పేటలో భారీగా వర్షపునీరు ప్రవహించింది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్ కేసర్, తదితర ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
Hyderabad Rain Today : కార్యాలయ పని వేళలు ముగించుకొని ఉద్యోగులందరూ ఇళ్లలోకి చేరుకునే సమయంలో కావడంతో రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసి పోయాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు ఇంటికి చేరుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లి రోడ్లపైకి నీరు చేరింది. కుత్బుల్లాపూర్ బహదూర్ పల్లి, సూరారం, పెట్ బషీరాబాద్, జీడిమెట్ల,షాపూర్ నగర్, చింతల్, జగద్గిరిగుట్ట పలు ప్రాంతంలో భారీ వర్షం పడింది. వర్షంతో పంజాగుట్ట బేగంపేట ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు నిలిచిపోయాయి. పంజాగుట్ట ఫ్లైఓవర్ పై నిలిచిన వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఖైరతాబాద్ మెట్రోస్టేషన్, మెర్క్యురీ హోటల్, పంజాగుట్ట మోడల్ హౌజ్ వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు వచ్చి చేరడంతో వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నాలాల నుంచి నీళ్లు వెల్లే కంటే వరద నీరు ఎక్కువగా వచ్చి చేరడంతో మోకాళ్ల లోతు వరకు నీళ్లు చేరాయి.
జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు: హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలోనూ వర్షం పడుతుండటంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న వాహనాలు ఎక్కడిక్కడ నిలిచి పోయాయి. వర్షం ధాటికి దారి కనిపించక వాహనదారులు నెమ్మదిగా వస్తున్నారు.
అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు: జంటనగరాల్లో భారీగా కురుస్తున్న వర్షంతో డీఆర్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. సహాయ చర్యలకు టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. సహాయం కోసం 040-2111 1111, 90001 13667 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని డీఆర్‌ఎఫ్ అధికారులు హెచ్చరించారు.
అప్రమత్తమైన విద్యుత్‌శాఖ: గ్రేటర్ హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. సూపరింటెండింగ్ ఇంజినీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని టీఎస్ఎస్పీడీసీఎల్ (TSSPDCL) సీఎండీ జి రఘురామా రెడ్డి సమీక్షించారు. విద్యుత్ సమస్యలకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 1912, 100, 7382071574, 7382072106, 7382072104 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. విద్యుత్ లైన్లు, విద్యుత్ స్తంభాలు, ఇతర విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నగర వాసులకు విజ్ఞప్తి చేశారు.
రేకులు పడి ఒకరు మృతి: అబిడ్స్‌లో రేకులు మీద పడి ఒకరు మృతి చెందారు. వర్షానికి ఫరీద్ అనే వ్యక్తి గోడ పక్కన నిల్చుండగా.. గాలికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తు నుంచి ఐరన్ రేకులు వచ్చి మీద పడ్డాయి. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. భారీ వర్షానికి నారాయణగూడ విఠల్‌వాడిలో పురాతన ఇంటి గోడ కూలింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది.
కుతుబ్‌షా మసీద్‌పై పిడుగు: హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని కుతుబ్‌షా మసీద్‌పై పిడుగు పడింది. దీంతో మసీద్‌పై ఉన్న గోపుర కలశం ఊడి కింద పడిపోయింది. పిడిగు ధాటికి మసీద్‌లోకి గోడలకు పగుళ్లు ఏర్పాడ్డాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్.. ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. అలాగే అత్తాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై పిడుగు పడింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. పిడుగుదాటికి అపార్ట్మెంట్లోని టీవీలు, ఫ్రిజ్‌లు, లిఫ్ట్ కాలిపోయాయి.
ఇవీ చదవండి: