దేశవ్యాప్తంగా గతకొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి ఏమైనా చిల్లు పడిందా అన్నట్లు వానలు పడుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎక్కడ చూసినా వర్షపు నీరే కనిపిస్తుంది. ఇంట్లో ఆహార పదార్థాలు నీటమునిగి.. తిండి లేక నాలుగు రోజులుగా అనేక మంది ప్రజలు గడుపుతున్నారు.
'మహా'లో కుండపోత వర్షాలు.. మహారాష్ట్రలోని ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడి ప్రతాపానికి ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడ్చిరోలి జిల్లాలోని 29 గ్రామాలకు చెందిన 3000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరిలించినట్లు అధికారులు తెలిపారు. భారత వాతవరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదారమ్మ.. జిల్లాలో గోదావరి, ఇంద్రావతి నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుండగా, పెన్‌గంగా, ప్రాణహిత నదులు ప్రమాద స్థాయికి చేరువలో ఉన్నాయని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ఈ నదుల ప్రవాహ ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత రెండు రోజుల్లో వర్షాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు.
డ్యామ్ గేట్లు ఎత్తివేత.. భారీ వర్షాల కారణంగా ఇరై డ్యామ్‌లో నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో అధికారులు డ్యామ్ గేట్లు తెరిచారు. వరద నీటితో చంద్రపుర్ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని రోడ్లు నదులను తలపిస్తున్నాయి.
'తాగునీటి కోసం నది దాటాల్సి వస్తుంది'.. నాసిక్ జిల్లాలోని బోరీచీవాడి గ్రామంలోని మహిళలు తాగునీటి కోసం అనేక కష్టాలు పడుతున్నారు. గ్రామ పరిసరాల్లో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్లి అక్కడ ఉన్న బావి నుంచి తెచ్చుకుంటున్నారు. "ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ.. అమలు చేయడం లేదు. అందుకే మేము నదిని దాటి అక్కడ ఉన్న బావి వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నాం. కొన్నిసార్లు గత్యంతరం లేక వర్షపు నీటిని కూడా నిల్వ చేసుకుని తాగుతున్నాం" అని మహిళలు వాపోతున్నారు.
వరద వలయంలో గుజరాత్.. గుజరాత్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. గతకొన్ని రోజులుగా అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నవ్‌సారి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి చేరింది. మోకాల్లోతు నీటిలో ప్రజలు జీవిస్తున్నారు. తాపి, వడోదర జిల్లాల్లో చిక్కుకుపోయిన 45 మందిని అధికారులు రక్షించారు.
394 మి.మీ వర్షపాతం నమోదు.. నవ్‌సారి జిల్లాలో అత్యధికంగా 394 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. వల్సాద్ జిల్లాలోని 377 మిమీ వర్షపాతం నమోదైందని పేర్కొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వల్ల పూర్ణా, అంబికా నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. అహ్మదాబాద్-ముంబయి జాతీయ రహదారిపై వరద నీరు భారీగా నిలిచింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
రాజస్థాన్‌లో కుండపోత వర్షాలు.. రాజస్థాన్‌లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఝలవర్ ప్రాంతంలో 140 సె.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. దాంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయని చెప్పారు. బన్స్వారా, దుంగార్‌పుర్, ప్రతాప్‌గఢ్, బార్మర్, జలోర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
ఇవీ చదవండి: అమర్‌నాథ్ యాత్రలో బస్సు ప్రమాదం.. 14 మందికి గాయాలు
8 ఏళ్లుగా రేప్.. మహిళ ఆత్మహత్య- కూతురి జననాంగాల్లో వేడి నూనెపోసి..